నగరాలు, పట్టణాల్లో డ్రాట్ బీర్.. హైదరాబాద్ లో ప్రతి 5 కిలోమీటర్లకు బీర్ కేఫ్?

నగరాలు, పట్టణాల్లో డ్రాట్ బీర్..  హైదరాబాద్ లో ప్రతి 5 కిలోమీటర్లకు బీర్ కేఫ్?
  • పట్టణాల్లో 30 కి.మీలకు ఒకటి 
  • ప్రస్తుతం రాష్ట్రంలో 18 మైక్రో బ్రూవరీలు
  • బార్లు, పబ్బులకు కంటెయినర్ల ద్వారా సరఫరా
  • కొత్తగా 50 మైక్రో బ్రూవరీల  ఏర్పాటుకు చాన్స్
  • వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ లో ఏర్పాటుకు సన్నాహాలు
  • స్థానికంగా అమ్ముకొనేలా బీర్ కేఫ్ ల ఏర్పాటు
  • పెరగనున్న ఆబ్కారీ శాఖ ఆదాయం

హైదరాబాద్: మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  తెలంగాణలో డ్రాట్ బీర్లు రానున్నాయి. హైదరాబాద్ లో ప్రతి ఐదు కిలోమీటర్ల దూరానికి ఒక బీర్ కేఫ్ ఏర్పాటు కానుంది. వాటి ద్వారా బీర్ విక్రయాలు కొనసాగించాలని ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 18 మైక్రో బ్రూవరీలు పనిచేస్తున్నాయి.  వీటి ద్వారా నగరంలోని బార్లు, పబ్బులకు కంటెయినర్ల ద్వారా 1.8 మిలియన్ బల్క్ లీటర్ల బీర్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఈ మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. వీటిని  స్థానికులే నిర్వహిస్తున్నారు.  

మైక్రోబ్రూవరీలను జిల్లాలకు విస్తరించాలనే ఆలోచన కూడా ఉంది. తమకు అనుమతి ఇవ్వాలంటూ 50 దరఖాస్తులు కూడా ఆబ్కారీశాఖకు వచ్చినట్టు సమాచారం. మైక్రో బ్రూవరీలు, బీర్ కేఫ్​ కల్చర్ ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగళూరు, పుణె వంటి  నగరాల్లోనే ఉంది. తెలంగాణలో బీర్లు తాగేవారు ఎక్కువగా ఉన్నప్పటికీ బీర్ కేఫ్ లు ఏర్పాటు కాలేదు.  ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్తగా బీర్ కేఫ్ ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

దీనిపై ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల్లో బీర్ కేఫ్ లను  ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని  సమాచారం.  క్లబ్బులు, ఎలైట్ మద్యం షాపులు, స్టార్ హోటళ్ళు తమ సొంత ఇన్-హౌస్ మైక్రో బ్రూవరీలను నిర్వహించడానికి అనుమతులను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.   మైక్రోబ్రూవరీలు తాజా, రుచికరమైన బీర్లను అందిస్తాయి.  గంటల్లోనే తయారు చేసి అందించే అవకాశం ఉంది.  తెలంగాణ కనీసం 50 కొత్త మైక్రో బ్రూవరీల ఏర్పాటుపై సర్కారు దృష్టి సారిస్తోందని తెలుస్తోంది.