ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు సర్కారు రెడీ.. క్యూర్ పరిధిలో మొత్తం రూ. 5 వేల 864.92 కోట్లు 

ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు సర్కారు రెడీ.. క్యూర్ పరిధిలో మొత్తం రూ. 5 వేల 864.92 కోట్లు 
  • వడ్డీలో ఓటీఎస్ కింద 90 శాతం మాఫీ
  • రూ. 1,686.39 కోట్లు చెల్లించేందుకు సిద్ధం  
  • ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీవో విడుదల

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) కింద చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ రూ.1,580.96 కోట్లు, ఇంట్రెస్ట్ రూ.4,178.53 పేరుకుపోయినట్లు జీవోలో పేర్కొంది. దీంతో పాటు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 105.43 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఉందని వెల్లడించింది. 

అన్నీ కలిపితే రూ. 5864.92 కోట్లు ఇవ్వాలని, బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతాన్ని ఓటీఎస్ కింద మాఫీ చేస్తే మిగిలిన రూ. 1,686.39 కోట్లు చెల్లించనున్నట్లు ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మంగళవారం జీవో జారీ చేశారు. నిజానికి ఈ ఏడాది మార్చి నెలాఖరుతోనే ఓటీఎస్ గడువు ముగిసింది. 

కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా పేరుకుపోవటం, జీహెచ్ఎంసీ పరిధి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావడంతో, ఆ కార్పొరేషన్లలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్పొరేషన్లు సర్కారు ఆర్థిక సహాయంపైనే ఆధారాపడ్డాయి. దీంతో సర్కారు ఓటీఎస్ స్కీమ్ కింద ట్యాక్స్ బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది. 

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ  

జీహెచ్ఎంసీ పరిధిలో సర్కారు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ రూ.5,864.92 కోట్లు కాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రూ.5,612.04 కోట్లు ఉంది. వీటిలో వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ కింద వడ్డీ రూ. 4026.63 కోట్లను మినహాయించగా, జీహెచ్ఎంసీకి రూ. 1,585.41 కోట్లను చెల్లించాలి. 

సీఎంసీ పరిధిలో కూడా సర్కారు ఆస్తులు 267 ఉండగా, వీటికి ఇప్పటి వరకు పేరుకుపోయిన వడ్డీ, ట్యాక్స్ మొత్తం రూ. 52.75 కోట్లు. వడ్డీని మినహాయించగా..రూ. 24.87 కోట్లను సర్కారు చెల్లించనున్నది. ఇక ఎంఎంసీలో కూడా సర్కారు ఆస్తులు 393 ఉండగా, ట్యాక్స్ బకాయిలు రూ. 200.13 కోట్లకు పేరుకుపోయాయి. వడ్డీని మాఫీ చేసిన తర్వాత రూ. 76.11 కోట్లను సర్కారు చెల్లించనుంది.