ఊరికో ట్రాక్టర్: త్వరలో విధివిధానాలు

ఊరికో ట్రాక్టర్: త్వరలో విధివిధానాలు

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఓ ట్రాక్టర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌‌లో దీనికి నిధులివ్వాలని ఆలోచిస్తోంది. కొనుగోలు, పంపిణీ గైడ్ లైన్స్‌‌ను కూడా త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

అంత ఖర్చు భరిస్తరా?

రాష్ట్రంలో 12,751 పంచాయతీలున్నాయి. మార్కెట్లో ట్రాక్టర్ రేటు రూ.5 లక్షలకు పైనే ఉంది. కంపెనీలు, వాటి మోడళ్ల ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువే అవుతుంది. అన్ని ఊళ్లకు ట్రాక్టర్లు ఇవ్వాలంటే రూ.700 కోట్ల పైన ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో సర్కారు ఖర్చు చేస్తుందా అని అనుమానాలున్నాయి. ప్రస్తుతం సుమారు వెయ్యి మేజర్ పంచాయతీల్లో ట్రాక్టర్లు ఉన్నట్లు కార్మిక నేతలు చెబుతున్నారు. కానీ అవి చాలా కాలం కింద కొన్నవంటున్నారు. కాబట్టి ట్రాక్టర్లు లేని చోటే ఇస్తారా.. లేక అన్ని పంచాయతీలను లెక్కలోకి తీసుకుంటారా తెలియాల్సి ఉంది. మరోవైపు ట్రాక్టర్లకు ఎక్కువ ఖర్చవుతున్నందున బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌‌గా తీసుకుంటారా? లేక పంచాయతీ యూనిట్‌‌గా రుణం తీసుకుంటారా? స్పష్టత రావాల్సి ఉంది. పంచాయతీ పేరుతో ట్రాక్టర్లను రిజిస్టర్‌‌ చేస్తారని తెలుస్తోంది.

కార్మికుల సంగతేంది?

రాష్ట్రంలో 8 వేల పంచాయతీలుండగా 500 జనాభా దాటిన 4,380 తండాలు, గ్రామాలను పంచాయతీలుగా ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసింది. కానీ పంచాయతీలకు తగ్గట్టు కార్మికుల సంఖ్య పెరగలేదు. ప్రతి 500 జనాభాకు ఓ కార్మికుడు ఉండాలని సీఎం పలు సార్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టు కార్మికులను నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య 13 వేల మందిని నియమించాలని ప్రభుత్వానికి పంచాయతీ రాజ్‌‌ శాఖ ప్రతిపాదనలు పంపింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

డబ్బులు సర్కారే ఇవ్వాలి

ట్రాక్టర్లు ఇచ్చే ప్రతిపాదన మంచి నిర్ణయమే. అయితే వాటి నిర్వహణ వ్యయం, కార్మికులకు వేతనాలు సర్కారే చెల్లించాలి. పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాలు రూ.3 వేల లోపే ఉన్నాయి. వాటిని రూ.8,500కు పెంచాలి.

‌‌‌‌- పాలడుగు భాస్కర్, గౌరవ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్

పరిశీలనలో ఉంది

పారిశుధ్యం, హరితహారం, ఇతర అవసరాల కోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చే ప్రతిపాదన ఉంది. ఇప్పటికే కొన్ని మేజర్ పంచాయతీల్లో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ నిధులు, లోన్‌‌తో కొనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. బడ్జెట్ సమావేశాల నాటికి దీనిపై స్పష్టత వస్తుంది.

– వికాస్‌‌రాజ్, ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.