
- 27న పొలిటికల్ పార్టీలతో జిల్లాల్లో మీటింగ్.. 28న రిజర్వేషన్ల గెజిట్
- ప్రచురించేలా ఏర్పాట్లు
- 29న లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు షెడ్యూల్ ప్రకటించే చాన్స్
- పకడ్బందీగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ నెల 26 న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. 26న రాత్రి జిల్లా కలెక్టర్లకు జీవోను పంపనున్నట్లు సమాచారం. ఆ వెంటనే 27న పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్‌లు ఏర్పాటు చేసి, రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ను ప్రచురించి ఈ నెల 28వ తేదీ కల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నది. ఆ మరుసటి రోజు 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నది. రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పోలింగ్ అధికారులు (పీవోలు), సహాయ పోలింగ్ అధికారుల (ఏపీవోలు) కు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ నెల 26, 27వ తేదీల్లో ట్రైనింగ్ క్లాసులు జరపాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు.. అదే జీవో
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు పక్కా ప్లాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందుకోసం డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకున్నట్లు స్పష్టం చేయనున్నది. గతంలో జీవోతోనే చేసిన ఎస్టీల రిజర్వేషన్ల పెంపును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం –2018కు సవరణ చేసిన గెజిట్‌ను ప్రచురించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. ఎంపిరికల్ డేటాను విశ్లేషించి.. రిజర్వేషన్ల పై నివేదిక ఇస్తుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తుంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ , ఒకవేళ బీసీలకు సంబంధించి ఉన్న వెనకబాటు ఎంపిరికల్ డేటాఉంటే రిజర్వేషన్లు పెంచుకునే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక జీవోను బీసీ శాఖ ఇవ్వనున్నది. దానిని పంచాయతీరాజ్ శాఖ అడాప్ట్ చేసుకొని, రిజర్వేషన్ల గెజిట్ ప్రచురిస్తుందని సెక్రటేరియెట్ వర్గాలు వెల్లడించాయి.