- గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రపంచస్థాయి అథ్లెట్లకు కేంద్రంగా ఎదుగుతోందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన 74వ ‘బీఎన్ మల్లిక్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్’ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, అడిషనల్ డీజీపీలు సంజయ్ కుమార్ జైన్, అనిల్ కుమార్, డీఐజీ అభిషేక్ మహంతి తదితరులతో కలిసి క్రీడలను ప్రారంభించారు. పోలీసులకు స్పోర్ట్స్ కేవలం హాబీ మాత్రమే కాదని, విధి నిర్వహణలో శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తాయని అన్నారు.
పరస్పర సహకారం, ఐక్యత కోసం..: డీజీపీ
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ సేవలో క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఫుట్‌బాల్ మాదిరిగానే జట్టు కృషి, వ్యూహం, ఓర్పు, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, సహచరులపై నమ్మకం వంటి లక్షణాలు ప్రతి పోలీసు అధికారికి అవసరమన్నారు. ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీ మాత్రమే కాదని, దేశవ్యాప్త పోలీసు బలగాల మధ్య పరస్పర సహకారం, స్నేహం, ఐక్యతకు వేడుక అన్నారు.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగనున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల పోలీస్ బలగాలు, కేంద్ర పారామిలటరీ దళాల నుంచి మొత్తం 43 జట్లు పాల్గొంటున్నాయి. 851 మంది పురుషులు, 187 మంది మహిళా క్రీడాకారిణులు సహా మొత్తం 1038 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారు. పలు గ్రౌండ్స్‌లో మొత్తం 110 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
