రేపు రాజ్​భవన్​లో మహిళా దర్బార్​

రేపు రాజ్​భవన్​లో మహిళా దర్బార్​
  • గవర్నర్ తమిళిసై ప్రకటన  
  • ఇప్పటికే గ్రీవెన్స్ బాక్స్​కు ఫిర్యాదుల వెల్లువ 
  • ప్రజా దర్బార్​కూ భారీగా రెస్పాన్స్ వచ్చే చాన్స్

హైదరాబాద్, వెలుగు : రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ తమిళిసై బుధవారం ప్రకటించారు. ఈ నెల10న మధ్యాహ్నం 12 గంటలకు మహిళా దర్బార్ తో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నట్లు రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా దర్బార్ కు హాజరై గవర్నర్ ను కలవాలనుకునే మహిళలు 040‌‌‌‌ 23310521 నెంబర్ కు ఫోన్ చేసి.. లేదా “rajbhavan-hyd@gov.in” ఐడీకి మెయిల్ చేసి అపాయింట్ మెంట్ పొందొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మహిళా దర్బార్ కు భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ ను ఏర్పాటు చేస్తామని గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే తమిళిసై ప్రకటించారు. కరోనా వల్ల వాయిదా పడినట్లు పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు.

గ్రీవెన్స్ బాక్స్ కు మస్త్ స్పందన

గవర్నర్ నిర్ణయం మేరకు ఈ యేడాది జనవరి 1న రాజ్ భవన్ లో ఏర్పాటైన గ్రీవెన్స్ బాక్స్ కు భారీగా స్పందన వచ్చింది. రాజకీయ నేతలతో సహా ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, పబ్లిక్ తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులను ఇందులో వేశారు. ఉద్యోగుల బదిలీలు, జోన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవో  317లో సవరణలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. పబ్లిక్ ఫిర్యాదు చేసిన వాటిల్లో ప్రభుత్వ అధికారుల అవినీతి, భూ కబ్జాలు, అధికారులపై ఫిర్యాదులు, ధరణి పోర్టల్ సమస్యల వంటివే అధికంగా ఉన్నాయి.  ప్రతిరోజూ సాయంత్రం బాక్స్ ను ఓపెన్ చేసి వీటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పబ్లిక్ సమస్యలు అయితే సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.