చినపాక నియోజకవర్గంలో గవర్నర్ తమిళిసై

చినపాక నియోజకవర్గంలో గవర్నర్ తమిళిసై

వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం చినపాక నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి మణుగూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు భరోసా కల్పించేందుకు తాను పర్యటించడం జరుగుతోందని తమిళిసై వెల్లడించారు. వరద బాధితులతో మాట్లాడనున్నారు. వారికి నిత్యావసరాలు, మందులు పంపిణీ చేయనున్నారు. గవర్నర్ వెంట రెడ్ క్రాస్, ఈఎస్ఐ డాక్టర్ల టీమ్ ఉంది. మణుగూరు పర్యటన అనంతరం నేరుగా భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకోనున్నారు. అక్కడ అధికారులతో సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరింది. మొత్తం 95 ముంపు గ్రామాలున్నాయి. దాదాపు 25 వేల మంది సహాయక శిబిరాల్లో తల దాచుకున్నారు. 

భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగిందంటున్నారు స్థానికులు. వరద కంటిన్యూ అవుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జ్ పై  రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి.