14 ప్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌లకు కొత్త ఇన్‌‌‌‌చార్జి కమిటీలు...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

14 ప్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌లకు కొత్త ఇన్‌‌‌‌చార్జి కమిటీలు...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  •     ఆరు నెలలు లేదా ఎన్నికల వరకు బాధ్యతలు: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) కొత్త పర్సన్- ఇన్-చార్జి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు ఆరు నెలలు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు జరిగే వరకు, ప్రభుత్వం కొత్త ఆదేశాలు ఇచ్చే వరకు బాధ్యతలు నిర్వహిస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్ చేసిన పరిశీలనలో పలు లోపాలు బయటపడ్డాయని మంత్రి చెప్పారు. రుణాల వసూళ్లలో జాప్యం, బకాయిదారులపై చర్యలు లేకపోవడం, ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్‌‌‌‌లో ఉండడం, కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరుకాకపోవడం, సహకార సంఘాల లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలను గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్యాక్స్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. 

రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా అందించేందుకే కొత్త ఇన్‌‌‌‌చార్జి కమిటీలను నియమించినట్లు వివరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు, తాడికల్, మెట్‌‌‌‌పల్లి, వరంగల్ జిల్లా అమీనాబాద్, ఖానాపూర్, మహ్మదాపూర్, మందపల్లి, సూరిపల్లి, రెడ్లవాడ, చెన్నరావుపేట, గురిజాల, నర్సంపేట, అలాగే వికారాబాద్ జిల్లా కుల్కచర్ల, పరిగి ప్యాక్స్‌‌‌‌లకు ఈ కమిటీలను నియమించినట్లు మంత్రి తెలిపారు. కొత్త కమిటీలు వెంటనే బాధ్యతలు చేపట్టి ఆయా సహకార సంఘాల పనితీరును పర్యవేక్షిస్తాయని, ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్‌‌‌‌ను ప్రభుత్వం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.