
హయత్ నగర్ కు చెందిన స్వప్న తన కొడుక్కి హెల్త్ బాగా లేకపోవడంతో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. మెడికల్ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు అడ్మిట్చేయాలని సూచించారు. తాగడానికి నీళ్లు కావాలని తన భర్తకు చెప్పడంతో ఆస్పత్రి అంతా తిరిగినా ఎక్కడా చుక్కనీరు దొరకలేదు. బయట షాప్ లో బాటిల్ కొనితెచ్చాడు. కూలీడబ్బులతో జీవనం సాగించే తమకు వాటర్‌బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగే స్తోమత లేదని వాళ్లు వాపోయారు. వారి కుమారుడికి దూప కావడంతో సెలైన్ డ్రిప్ తోనే కొడుకును ఎత్తుకొని ఆస్పత్రి బయటకు వచ్చి నీళ్లు తెచ్చుకుంది. చికిత్స కోసం దవాఖానాకు వచ్చిన ప్రతి ఒక్కరూ తాగునీటి విషయంలో నానా తంటాలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఎల్ బీ నగర్, వెలుగు: ఎండల ప్రభావం సర్కారు దవాఖానాపైనా పడుతోంది. నీటి ఎద్దడితో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులు, వారితో వచ్చిన సహాయకులు అవస్థ పడుతున్నారు. వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ తాగడానికి, కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక చికిత్సకు వచ్చిన వారు ఇబ్బందిపడుతున్నారు. 100 పడకలున్న దవాఖానా కావడంతో ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు సరూర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసర గ్రామాల నుండి రోజు దాదాపు వెయ్యి మందికి పైగా ఔట్‌పేషంట్లు వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఇన్ పేషెంట్స్ 30 నుంచి 40 దాకా ఉంటారు. ప్రతి సోమ, బుధవారాల్లో ప్రత్యేక చికిత్స కోసం గర్భిణులు దాదాపు 300 మందికిపైగా వస్తారు. రోజూ వేలాది మందికి వైద్య సేవలందిస్తున్న ఇంత పెద్ద దవాఖానాలో కనీస అవసరాలు తీరేలా తాగునీటి వసతి లేకపోవడంతో రొగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
ఆస్పత్రి ఆవరణలో ఉన్న బోరు అడుగంటి పోవడంతో నీటికి తిప్పలు మొదలైనట్టు తెలుస్తోంది. రెండు నెలలుగా ఇక్కడ తాగునీటి సమస్య తలెత్తడంతో హాస్పిటల్‌కు వచ్చేవారు తమ వెంట తప్పకుండా నీళ్ల డబ్బా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ వార్డు వద్ద చూసిన పెషెంట్ మంచం పక్కన నీటి డబ్బాలే కనిపిస్తాయి. నీటి కొరతతో మూత్రశాలలు వినియోగించుకోలేక రోగులు ఇబ్బందికి గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రెండు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొద్ది రోజులు రెండు ట్యాంకర్లు పంపిన అధికారులు ప్రస్తుతం ఒకే ట్యాంకర్‌తో నీటి సరపరా చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దవాఖానాలో తాగునీటి వసతి కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఆస్పత్రిలో డయాలసిస్ సౌకర్యం ఉండటంతో రోజు 20మంది దాకా పేషెంట్స్ కు చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 3 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది. ఇక్కడ ఉన్న నీటి సమస్యతో రోజు 15మందికి మాత్రమే చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా రోగులు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు.