సర్కార్ బడుల్లో స్టూడెంట్స్ కౌన్సిల్స్

సర్కార్ బడుల్లో స్టూడెంట్స్ కౌన్సిల్స్
  • విద్యార్థుల్లో లీడర్ షిప్​ క్వాలిటీస్ పెంచేందుకు చర్యలు 
  • ప్రతి స్కూల్, క్లాసును నాలుగు భాగాలుగా విభజన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచేందుకు సర్కారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా అన్నీ స్కూళ్లలో హౌజ్ సిస్టమ్ అండ్ స్టూడెంట్ కౌన్సిల్ టీములను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఈమేరకు డీఈఓలతో బుధవారం ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. వెంటనే ఈ కమిటీలను నియమించాలని ఆదేశించారు. గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, యూఆర్ఎస్ తదితర బడుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 

దీని ప్రకారం ప్రతి స్కూల్​ను నాలుగు గ్రూపులుగా (హౌజులుగా), ప్రతి క్లాస్​నూ నాలుగు గ్రూపులు చేయనున్నారు. అబ్దుల్ కలామ్ గ్రూపునకు రెడ్ కలర్, శకుంతలదేవి గ్రూపునకు గ్రీన్ కలర్, సీవీ రామన్ గ్రూపునకు బ్లూ, రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రూపునకు ఎల్లో కలర్​ వేయనున్నారు. ప్రతి గ్రూపునకు మెంటర్​గా ఒక టీచర్​ను నియమించనున్నారు. హెడ్మాస్టర్, టీచర్లు కలిపి ఈ గ్రూపులను వేస్తారు. ప్రతి గ్రూప్​కు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఉంటారు. వీరందరినీ సమన్వయం చేసేందుకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్​ను నియమిస్తారు. వీరితో పటు స్పోర్ట్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ తో పాటు ఆరుగురు క్లబ్ సెక్రటరీలను ఎంపిక చేస్తారు. ప్రతి స్టూడెంట్ ఏదైనా ఒక గ్రూపులో ఉండనున్నారు. 

ఈ గ్రూపుల బాధ్యతలు ఇవే..

ఉదయం అసెంబ్లీ నిర్వహించడంతో పాటు మిడ్డెమీల్స్ పర్యవేక్షణ, క్రమశిక్షణను పాటించేలా చూడటం, ఇంటర్-హౌస్ పోటీలను నిర్వహించడం, స్టూడెంట్ల మధ్య చర్చలకు టీచర్లు మధ్యవర్తులుగా ఉంటారు. క్లబ్ సెక్రటరీలు ఏకో క్లబ్స్, గర్ల్స్ చైల్డ్ ఎంపవర్ మెంట్, ప్రహరీ క్లబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ, కల్చరల్ క్లబ్ తదితర అంశాలను పర్యవేక్షిస్తుంటారు. కాగా, ఈ నెల 15న కొత్తగా ఎంపికైన కౌన్సిల్ సభ్యులను పేరెంట్స్, గ్రామస్థుల సమక్షంలో ప్రకటించనున్నారు. వీటి నిర్వహణకు అవసరమైన బడ్జెట్​నూ అధికారులు సాంక్షన్ చేశారు.