కృష్ణాలో 50% వాటా ఇస్తేనే.. ప్రాజెక్టులు అప్పగిస్తం: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

కృష్ణాలో 50% వాటా ఇస్తేనే.. ప్రాజెక్టులు అప్పగిస్తం: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నికర జలాల్లో 50 శాతం వాటా ఇస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తామని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈమేరకు బుధవారం కేఆర్​ఎంబీ చైర్మన్​కు ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గంపగుత్తగా 811 టీఎంసీలను కేటాయించిందని, ఆ నీటిలో తెలంగాణలో 405.5 టీఎంసీలు వాటా ఇవ్వాలని కోరారు.

శ్రీశైలం ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం కనీస నీటిమట్టం 830 అడుగులుగా నిర్ణయించాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 19 టీఎంసీలు, మద్రాస్ తాగునీటికి 15 టీఎంసీలు కలుపుకొని 34 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా కట్టడి చేయాలని కోరారు. తెలంగాణకు చేసిన కేటాయింపుల్లో ఒక వాటర్ ఇయర్​లో ఉపయోగించుకోకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్​లో నిల్వ చేసుకున్న నీటిని మరుసటి ఏడాది ఉపయోగించుకునేలా అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి కోసం తీసుకునే నీటిలో బచావత్ అవార్డులో పేర్కొన్నట్టుగా 20 శాతమే వినియోగం కింద లెక్కించాలని తేల్చి చెప్పారు.

ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1954లోని సెక్షన్–3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పున:పంపిణీ బాధ్యతను బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్​కు రెఫర్ చేసిందని, ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసి ఆపరేషన్ ప్రొటోకాల్ నిర్ధారించే వరకు తమ షరతులకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపితే ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరం లేదని తెలిపారు. జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తాము శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తామని తాము అంగీకారం తెలుపలేదని, అయినా మినిట్స్​లో మాత్రం తాము అంగీకరించినట్టుగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఆ మీటింగ్​లో నాగార్జున సాగర్​లో నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని మాత్రమే కోరామని, కానీ.. మినిట్స్​లో అందుకు విరుద్ధంగా అంశాలు ప్రస్తావించారని తెలిపారు. ఆ మినిట్స్​ సవరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మూడు రోజుల కింద లేఖ రాశారు. 

సమావేశానికి హాజరు.. లేఖలోని అంశాలు మాత్రమే ప్రస్తావన

శ్రీశైలం, నాగార్జున సాగర్ అప్పగింతపై గురువారం కేఆర్ఎంబీ నిర్వహించే సమావేశానికి తెలంగాణ ఇంజనీర్లు హాజరై లేఖలోని అంశాలను ప్రస్తావించనున్నారు. బోర్డు లేవనెత్తే అంశాలపై స్పందించకుండా తాము లేఖలో ప్రస్తావించిన అంశాలను మాత్రమే చెప్పనున్నారు. ఆ తర్వాత మీటింగ్ నుంచి బయటకు రావాలని నిర్ణయించారు.