సెల్ఫీలు పెట్టాలె… వీడియో కాల్​చేయాలె: ప్రభుత్వం కొత్త రూల్స్‌‌

సెల్ఫీలు పెట్టాలె…  వీడియో కాల్​చేయాలె: ప్రభుత్వం కొత్త రూల్స్‌‌

ఏఈవోలకు ప్రభుత్వం కొత్త రూల్స్‌‌   
అసలు కంటే కొసరు పనే ఎక్కువవుతోందంటున్న ఉద్యోగులు

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అగ్రికల్చర్‌‌ ఎక్స్‌‌టెన్షన్‌‌ ఆఫీసర్ల(ఏఈవో)కు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏఈవోలు ఉదయం 8 గంటలకు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లాలి.  ప్రత్యేక యాప్‌‌ ద్వారా రోజు 25 మంది  రైతుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.  అంతేకాదు 20 మంది రైతులతో కలిసి, ఒక్కొక్కరితో సెల్ఫీ దిగి యాప్‌‌(కోబో)లో అప్లోడ్‌‌ చేయాలి. అంతేకాదు వీరు క్షేత్రస్థాయిలోకి వెళ్లారా లేదా అని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌‌ కేంద్రంగా ప్రత్యేక మానిటరింగ్‌‌ సెల్‌‌ ఏర్పాటు చేశారు. ఈ సెల్‌‌కు క్షేత్రస్థాయి నుంచి వీడియోకాల్‌‌ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు క్షేత్ర సందర్శన పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్​వర్క్‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. సంగారెడ్డి  జిల్లాలో ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నారు. మహబూబ్​నగర్​లో  కొంతమేర అమలవుతోంది.

పాత పనులు పక్కన పెట్టాల్సిందే..

రాష్ట్రంలో ప్రస్తుతం 2500 మంది వరకు ఏఈవోలు పని చేస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, సీడ్‌‌ విలేజ్‌‌ ప్రోగ్రామ్‌‌ ద్వారా ఎరువులు, విత్తనాలు, స్ర్పేయర్లు, కల్టివేటర్లు, ట్రాక్టర్లు, పరికరాలు అందించడం వీరి పని. పంట ఉత్పత్తి, దిగుబడుల అంచనాలు, కొత్త వెరైటీలు అందుబాటులోకి తీసుకురావడం, రైతులకు పంటలపై సూచనలు సలహాలు ఇవ్వాలి. సాయిల్‌‌ శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందించడం,  క్రాప్‌‌ దిగుబడి అంచనాలు రూపొందించడం వీరి ఉద్యోగంలో భాగం. నేల స్వభావాన్ని అంచనా వేసి  ఏ పంటలు  వేయాలో, ఏ పంట వేయకూడదో, ఎంత మోతాదులో పురుగుల మందులు వాడాలి ఇలా అనేక అంశాల్లో రైతుకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పించాలి. ఏటా రైతు చైతన్య యాత్రలు జరపాలి. కొత్త రూల్స్​తో ఏఈవోలు ఇప్పుడు పాత పనులన్నింటిని పక్కన పెట్టాల్సి వస్తోంది.

ఒత్తిడి తట్టుకోలేం

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూల్స్‌‌ ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న తమపై మరింత భారాన్ని పెంచుతున్నాయని అగ్రికల్చర్‌‌ ఎక్స్‌‌టెన్షన్‌‌ ఆఫీసర్లు(ఏఈవో) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన తాము బీమా ఏజెంట్లు, వీఆర్వోలు, క్లర్కులు, కంప్యూటర్‌‌ డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు నిర్వహించాల్సి వస్తోందంటున్నారు. ఇప్పకే నిమిషం ఖాళీ లేని తమపై పనిభారం పెంచుతున్నారని అంటున్నారు. దీనికి తోడు యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌, ఫీల్డ్‌‌ నుంచి వీడియో కాల్‌‌, రోజు రైతులతో సెల్ఫీలు అంటూ రూల్స్‌‌ పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ నిబంధనలు త్వరలో విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  నయా రూల్స్‌‌ అన్ని జిల్లాల్లో అమలు చేస్తే తిప్పలు తప్పదంటున్నారు.