బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..

బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..

హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక జీవోను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబరు 9ను విడుదల చేసింది. ఈ జీవోలో సామాజిక న్యాయం అనే అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. ఆర్టికల్‌ 40 ప్రకారం స్టేట్‌ పాలసీ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. రేపు (సెప్టెంబర్ 26, శనివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. తెలంగాణ సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. శనివారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం  జరుగుతోంది.

ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నది. ముందు ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు కూడా వారం రోజుల గ్యాప్లోనూ పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్​ స్టేషన్లు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్​ బాక్సులు వంటివన్నీ రెడీ చేసుకుని.. రిజర్వేషన్ల జాబితా కోసం వెయిట్​ చేస్తున్నది.