
- ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
- న్యాయ నిపుణుల సూచనలతో బీసీ కోటాపై ముందుకు
- రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- వానాకాలం సీజన్లో 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి
- సన్నవడ్లకు రూ.500 బోనస్.. వెంట వెంటనే రైతుల ఖతాల్లో జమ
- మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై స్టడీకి సీఎస్ చైర్మన్‌గా కమిటీ
- ప్రజాప్రభుత్వానికి రెండేండ్లు పూర్తికానుండంతో డిసెంబర్ 1–9 వరకు ఉత్సవాలు
- నల్సార్ వర్సిటీకి 7 ఎకరాల భూమి కేటాయింపు.. వర్సిటీలో స్థానికులకు 50% సీట్లు
- మన్ననూర్--–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మొత్తం వ్యయంలో మూడోవంతు భరించేందుకు రెడీ
- నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు అనర్హులు’ అనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్నందున ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్ చర్చించింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
వానాకాలం సీజన్లో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. వడ్లకు చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్‌ను రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేస్తామని తెలిపింది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. దాదాపు నాలుగు గంటల పాటు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన అంశంపై చర్చించారు. ఈ రూల్‌ను ఎత్తివేయాలంటూ వివిధ వర్గాల నుంచి సీఎంకు, మంత్రులకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు ఈ నిబంధన అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు.
మెట్రోపై కమిటీ
పార్ట్ 2 ఏ, 2బీ కింద మెట్రో విస్తరణ జరగాల్సి ఉందని.. ఈ ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కొర్రీలు పెట్టి వెనక్కి పంపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. దీంతో మెట్రో ఫేజ్ 1ను కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ టేకోవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి సంబంధించి ఫైనాన్షియల్, టెక్నికల్ అంశాలతో పాటు కేంద్రం పెట్టిన కొర్రీలు, రూ.36 వేల కోట్లతో మెట్రో ఫేజ్ 2ఏ, 2బీ విస్తరణ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి సీఎస్ చైర్మన్‌గా కమిటీ వేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇందులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ ఉన్నతాధికారుల కమిటీ తమ రిపోర్టును డిప్యూటీ సీఎం నేతృత్వంలోని రిసోర్స్ మొబిలైజేషన్‌పై ఇప్పటికే ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుందన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించినట్లు వివరించారు.
నల్సార్‌లో తెలంగాణకు 50% కోటా
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతానికి పెంచాలని తీర్మానం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అలాగే, ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని వర్సిటీకి కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీని కింద జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని, ఉత్సవాల నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రతి గింజా కొనుగోలు
కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సారి వానాకాలం సీజన్లో 1.48 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. ఇందులో 80 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రానుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల టన్నుల సేకరణకు అంగీకరించగా.. మరో 15 లక్షల టన్నులు సేకరణకు విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా పండించిన ప్రతి గింజను కొంటామని ప్రకటించింది.
ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు ఒక అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కొనుగోలు సెంటర్లను తనిఖీ చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించింది.
కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
- ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికిరక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున.. ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగించడం.
- కృష్ణా –వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హెక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం.
- మన్ననూర్ –శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (రూ. 7,500 కోట్లతో 75 కిలో మీటర్ల పొడవు) నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించడం.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు పది ఎకరాలు కేటాయింపు.
- కొత్తగా హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు.