
- ఆదివాసీ, ప్రజా సంఘాల హర్షం
ములుగు, వెలుగు: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు రూ.150 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అలుగు వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. మేడారం మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31వరకు జరుగనుండగా ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా శాశ్వత నిర్మాణాలు చేసేందుకు పనులకు శ్రీకారం చుట్టింది.
మేడారం మహాజాతరలో భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, శానిటేషన్, జంపన్న వాగులో తుంపర స్నానాలు, విడిది కేంద్రాలు, అధికారులకు గెస్ట్ హౌస్ లు, ఆదివాసీ చరిత్ర, సమ్మక్క, సారలమ్మల చరిత్ర, తదితర అంశాలను పరిణగలోకి తీసుకొని పర్మినెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఐదు శాఖల ద్వారా సివిల్ వర్క్స్, ఎనిమిది శాఖల ద్వారా నాన్ సివిల్ వర్క్స్ చేయనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లకు నిధులు మంజూరు చేయడంపై ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.