
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ఇటీవల జారీచేసిన జనగణన గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మళ్లీ గెజిట్‌ను జారీ చేశారు. ఈ జనగణనకు సంబంధించిన2027 మార్చి 1ని ప్రామాణిక తేదీగా పేర్కొన్నారు. ఈసారి జనగణన ప్రక్రియను డిజిటల్ విధానంలో.. అంటే ఎవరికివారు వ్యక్తిగత వివరాలను యాప్‌లో నమోదు చేసేందుకు కూడా అవకాశం కల్పించనున్నారు. జనాభా లెక్కల సేకరణ రెండు దశలుగా జరుగనుంది. మొదటి దశలో.. రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు, కట్టడాలు ఉన్నాయి.. అవి ఏయే రకాలుగా ఉన్నాయి..
వాటిలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయనే వివరాలను 2026 ఏప్రిల్, మే నెలల్లో సేకరిస్తారు. ప్రతి కుటుంబం నివసించే ఇంటిలో మౌలిక సదుపాయాల వివరాలన్నీ సమగ్రంగా నమోదు చేస్తారు. రెండోదశలో.. 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. ప్రజలు వ్యక్తిగతంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వారి వివరాలను నమోదు చేసే అవకాశం ఇచ్చినా దానిపై మరోసారి తనిఖీ ఉంటుంది. వారు ఇచ్చిన వివరాలన్నీ మరోసారి వెరిఫై చేసి నమోదు చేస్తారు. ఎవరైనా తప్పుడు సమాచారం నమోదు చేస్తే వెరిఫికేషన్లో గుర్తించి తొలగిస్తారు.