
- కిషోర బాలిక సంఘంలో 15 నుంచి 18 ఏండ్లవారు సభ్యులు
- 18 ఏండ్లు నిండితే మహిళా సంఘంలో చేరిక
- 60 ఏండ్లు దాటితే వృద్ధుల సంఘంలోకి..
- 40 శాతం వైకల్యం ఉన్నవారు దివ్యాంగుల సంఘంలోకి..
- కొత్తగా మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు
కామారెడ్డి, వెలుగు : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు కృషి చేస్తోంది. కిషోర బాలికలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు అమ్మాయిలు కిషోర బాలికల సంఘం, 18 ఏండ్లు పైబడినవారు మహిళా సంఘం, 60 ఏండ్లు పైబడితే వృద్ధుల సంఘం, 40 శాతం అంగవైకల్యం ఉన్నవారిని దివ్యాంగుల సంఘాలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలో 725 గ్రామ సమాఖ్యలు ఉండగా, వీటికి అనుబంధంగా కొత్తగా కిషోర బాలిక సంఘాలు 725, వృద్ధుల సంఘాలు 725, దివ్యాంగుల సంఘాలు 725 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 17,290 స్వయం సహాయక సంఘాలు..
జిల్లాలో ఇప్పటికే 17,290 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 1,68,039 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘంలో 10 మంది వరకు సభ్యులు ఉండాలి. కొన్నింటిలో 8 మంది కూడా ఉన్నారు. ఈ సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పొదుపు, ఉపాధి అవకాశాలు పొందేందుకు యూనిట్లను ఏర్పాటు చేశారు. బ్యాంక్ లింకేజీ ద్వారా లోన్లు ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుతున్నారు. క్యాంటీన్ల ఏర్పాటు, హైర్ బస్సుల కొనుగోళ్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, వడ్ల కొనుగోళ్లు వంటి బాధ్యతలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పజెప్పుతున్నది. ఇప్పటి వరకు సభ్యులుగా లేని వారిని గుర్తించి సంఘాల్లో చేర్పించాలని ప్రభుత్వం డీఆర్డీఏ అధికారులను ఆదేశించింది.
స్వయం రక్షణ, హెల్త్ కోసం బాల కిషోర సంఘాలు
15 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారితో కిషోర బాలిక సంఘాలు ఏర్పాటు చేస్తారు. బాలికలకు స్వయం రక్షణ, హెల్త్, పొదుపు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యుక్త వయస్సుల్లో వారికి వచ్చే మార్పులు, ఆరోగ్య విషయాలను వివరిస్తారు.
దివ్యాంగులు, వృద్ధుల సంఘాలు..
ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలో కనీసం 1 దివ్యాంగులు, వృద్ధుల సంఘం ఉండనుంది. ప్రస్తుతం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి 60 ఏండ్లు పైబడిన వారిని వృద్ధుల సంఘంలో చేర్పిస్తారు. జిల్లాలో 30 వరకు వృద్ధుల సంఘాలు ఉన్నాయి. వీటి సంఖ్య ఇంకా పెరగనుంది. సదరం సర్టిఫికెట్లో 40 శాతం వైకల్యం ఉండి పింఛన్ పొందుతున్న దివ్యాంగులతో సంఘం ఏర్పాటు చేస్తారు. వీరి ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.