
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలను సెప్టెంబర్ 1న హెచ్ఐసీసీలో నిర్వహిస్తామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సెక్రటేరియట్లో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. వజ్రోత్సవ ముగింపు ఉత్సవానికి సీఎం కేసీఆర్ హాజరై, ప్రత్యేకంగా ప్రసంగిస్తారని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నేతలు, అధికారులు పాల్గొంటారని వివరించారు.