
హైదరాబాద్, వెలుగు: సాదా బైనామాల క్రమబద్ధీకరణ నిమిత్తం 2020లో ఇచ్చిన జీవో అమలును నిలిపివేస్తూ ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ నిమిత్తం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబరులో జారీ చేసిన జీవో 112ను సవాలు చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవిదాస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు జీవోపై స్టే ఇస్తూ 2020 నవంబరు 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ స్టేను ఎత్తివేసి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా చట్టంలో నిబంధనలు లేవని, ప్రస్తుతం కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు.
ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014కు ముందు 12 ఏండ్లుగా సాదా బైనామాల ద్వారా భూమి స్వాధీనంలో ఉన్నట్లయితే క్రమబద్ధీకరించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం సుమారు 9.24 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తొలగిస్తే క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వారం గడువు ఇవ్వాలని కోరడంతో బెంచ్ 26కు వాయిదా వేసింది.