
- మే15న పోచంపల్లిలో నిర్వహణ
- నేత కార్మికులతో మాటా ముచ్చటకు ఏర్పాట్లు
- 140 దేశాల నుంచి 3 వేల మంది యువతులు రాక
మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరో 3 వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా వచ్చేనెల 15వ తేదీన విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనున్నది. ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం, ప్రత్యేకతలను వివరించేలా చర్యలు చేపడుతున్నది. చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ట్రాన్స్ లేటర్లను అందుబాటులో ఉంచనున్నది. అమ్మాయిలంతా పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నారు. గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ పోచంపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ పెడ్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే యువతులు చేనేత దుస్తులు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నది. ఇందుకోసం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను ఆహ్వానిస్తున్నది.
విదేశీ యువతులంతా చేనేత దుస్తులు ధరిస్తే ఆ రంగానికి చేయూతనిచ్చినట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వస్త్రాలతో సరికొత్త డిజైన్లతో దుస్తులు తయారు చేసి ధరింపజేసేలా సర్కార్ ప్లాన్ చేస్తున్నది.
వచ్చే నెల 7 నుంచి 31వ తేదీ వరకు పోటీలు
హైదరాబాద్ సిటీలో వచ్చే నెల 7 నుంచి 31వ తేదీ వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు 140 దేశాల నుంచి 3 వేల మంది అమ్మాయిలు, విదేశీ, మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరిని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు మంత్రి జూపల్లికృ ష్ణారావు, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిత్మాసబర్వాల్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
నాగార్జునసాగర్ లో విడిది
వివిధ దేశాల నుంచి వచ్చే యువతులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఆ ప్రదేశాలకు అంతర్జాతీయం గా గుర్తింపు కల్పించనున్నారు. ఇందులో భాగంగా భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట. నాగార్జునసా గర్ లోని బుద్ధవనాన్ని సందర్శించేలా అధికారులు ప్లాన్ చేశారు. వచ్చేనెల 12వ తేదీన నాగార్జునసాగర్ లోని కృష్ణానది తీరంలో ఉన్న బుద్ధ వనాన్ని సందర్శి స్తారు. నాగార్జునసాగర్ లోని విజయ విహార్ లో విడిది చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. తర్వాత 15వ తేదీన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. సమయాన్నిబట్టి ఒక డాక్యుమెంటరీ చేయనున్నట్లు తెలిసింది.
మోడ్రన్ పోచంపల్లి ఇక్కత్
పోచంపల్లిలో తొలుత నూలు చీరలు మాత్రమే నేసేవారు ఆ తర్వాత పట్టు చీరల తయారీ మొదలైంది. పోచంపల్లి చీరలు ఎంతో మోడ్రన్ గా ఉంటాయి. ఈ చీరల తయారీ.. ఇక్కత్ పై ఆధారప డుతుంది. ఈ పనితనం చీరాల నుంచి ఈ ప్రాంతాని కి వచ్చిందని అంటారు. నూలుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో అది పట్టు మీద కూడా చేయడం మొదలెట్టారు. గుజరాత్, ఒడిశా లాగా ఇక్కత్ నేతకు తెలంగాణలోని పోచంపల్లి ఎంతో ఫేమస్ అయ్యింది. ఇక్కడ తయారుచేసే చీరలు రూ.2 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటాయి. బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పోచంపల్లి వస్త్రాలను ఇష్టపడుతుంటారు