ఆర్టీఏ ఆఫీసులో అక్రమాల తిష్ట..ఏజెంట్లతోనే వ్యవహారం నడిపిస్తున్న ఆఫీసర్లు ?

ఆర్టీఏ ఆఫీసులో అక్రమాల తిష్ట..ఏజెంట్లతోనే వ్యవహారం నడిపిస్తున్న ఆఫీసర్లు ?
  •  పెన్సిల్ కోడ్‌‌‌‌‌‌‌‌తో చకచకా పనులు
  • నిరుడు మేలో మొక్కుబడి తనిఖీలు చేసి వదిలేసిన ఏసీబీ ఆఫీసర్లు 
  •  ఏళ్ల తరబడి నిరుపయోగంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్

కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా నడుస్తోంది. ఆఫీసులో వారు ఎక్కడా కనిపించనప్పటికీ.. వారు అప్లికేషన్ ఫామ్‌‌‌‌‌‌‌‌లపై రాసి పంపే పెన్సిల్ కోడ్స్ తో పనులు చకచకా జరిగిపోతున్నాయి. కొందరు ఆఫీసర్లు ఏజెంట్లతో కుమ్మక్కయి అప్లికేషన్‌‌‌‌‌‌‌‌కు ఇంత అని రేటు ఫిక్స్ చేసి.. రోజువారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రోజూ లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీఏ ఆఫీసులో వాహనదారులకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

మొక్కుబడి తనిఖీలు.. 

నిరుడు మే 28న ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసినప్పుడు ముందస్తు సమాచారంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయం ఆవరణలో నిత్యం తిరిగే ఏజెంట్లను బయటికి పంపి, సమీపంలోని ఏజెంట్ల ఆఫీసులు మూసివేయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ రోజు రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఫిట్ నెస్ టెస్ట్ అప్లికేషన్లపై ఏజెంట్లు రౌండప్ చేసిన పెన్సిల్ గుర్తులు.. కోడ్స్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. 

కానీ సంబంధిత ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ.. కరీంనగర్ ఆర్టీఏ ఆఫీస్ వైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

విజిలెన్స్ విభాగంలోనూ నామమాత్రపు తనిఖీలు

కరీంనగర్ జిల్లా మీదుగా నిత్యం ఇసుక, గ్రానైట్ ఓవర్ లోడ్ లారీలు రోజూ పదుల సంఖ్యలో వెళ్తుంటాయి. ఆర్టీఏ ఆఫీసర్లు వీటివైపు కన్నెత్తిచూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ విభాగం ఆఫీసర్లు రాత్రిళ్లు నామమాత్రపు తనిఖీలు చేసి లారీలను వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓవర్ లోడ్ పై నిఘా పెట్టకపోవడం కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసర్లకు ‘మామూలే’ననే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆఫీసులో సౌకర్యాలు కరువు.. 

తిమ్మాపూర్ లోని కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసు సమస్యలకు నిలయంగా మారింది. ఆఫీసర్లకు వచ్చే ఆదాయం మీద తప్ప. సౌకర్యాల కల్పనపై దృష్టి ఉండడం లేదు. ఆర్టీఏ ఆఫీసు ఆవరణలో ఏళ్ల క్రితం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వినియోగంలోకి తీసుకురావడం లేదు. ట్రాక్ మొత్తం ముళ్లపొదలతో నిండిపోయింది. దీంతో డ్రైవింగ్ టెస్టులు సమీపంలోని ఖాళీ ప్లేస్ లో నిర్వహిస్తున్నారు. 

వర్షాకాలంలో ఆ ప్రాంతమంతా నీళ్లు, బురద నిండిపోతోంది. దీంతో ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వివిధ పనులపై వచ్చే వాహనదారులకు కనీసం తాగేందుకు నీళ్లు, ఒంటికి, రెంటికి వెళ్లేందుకు టాయిలెట్లు అందుబాటులో లేవు. వెహికిల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ టెస్టులు, డ్రైవింగ్ టెస్టుల కోసం వచ్చే వ్యక్తులు చెట్ల కిందే నిల్చుని వెయిట్ చేయాల్సి వస్తోంది.