- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటిని కబ్జా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, ఎన్నికల హామీలపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అజారుద్దీన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా స్మశాన వాటికలు లేక మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన.. రక్షణ శాఖ, రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
