ఇస్లామాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత బలగాలు తమ మిలిటరీ స్థావరాలపై ఊహించని రీతిలో దాడి చేశాయని పాకిస్తాన్ ఒప్పుకుంది. భారత్ చేసిన దాడితో తమకు గట్టిగానే దెబ్బ తగిలిందని, రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైందని ఆ దేశ డిప్యూటీ ప్రధాని ఇషక్ దార్ తెలిపారు. ఇస్లామాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 36 గంటల్లో 80 డ్రోన్లను భారత్ ప్రయోగించిందని ఆయన వెల్లడించారు. మిలిటరీ స్థావరాలు ధ్వంసం కావడంతో పాటు సిబ్బంది కూడా గాయపడ్డారని చెప్పారు. అయితే, 79 డ్రోన్లను తమ మిలిటరీ అడ్డుకుందన్నారు. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి తాము విజ్ఞప్తి చేయలేదని పేర్కొన్నారు.
‘‘భారత్‌తో మాట్లాడడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ ముందుకు వచ్చారు. మే 10న ఉదయం 8.17 గంటలకు రుబియో నాకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకుందని, ఇందుకు మీరు (పాక్) ఒప్పుకుంటారా అని ఆయన అడిగారు. సీజ్ ఫైర్‌కు మేము కూడా సిద్ధంగా ఉన్నామని, యుద్ధం చేయడం మాకిష్టం లేదని చెప్పాను. అలాగే, సౌదీ ప్రిన్స్ ఫైసల్ కూడా నాకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని ఆయన తెలిపారు” అని దార్ వివరించారు. అలాగే, మే 7న భారత బలగాలు ప్రయోగించిన ఏడు జెట్లను తాము కూల్చివేశామని ఆయన పేర్కొన్నారు. కానీ, దీనికి ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేకపోయారు.
బంకర్లో దాక్కోమన్నారు: జర్దారీ
అంతకుముందు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా భారత బలగాల ప్రతీకార దాడులను ఒప్పుకున్నారు. ఆపరేషన్ సిందూర్ టైంలో బంకర్లలోకి వెళ్లి దాక్కోవాలని తన మిలిటరీ సెక్రటరీ తనకు సూచించారని, కానీ ఇందుకు తాను ఒప్పుకోలేదని తెలిపారు. ‘‘వీరమరణం పొందాల్సి వస్తే, అది ఇక్కడే వస్తుంది. లీడర్లు బంకర్లలో చావరు. వారు యుద్ధక్షేత్రంలో మరణిస్తారని ఆ సెక్రటరీకి చెప్పాను” అని జర్దారీ వెల్లడించారు. కాగా.. భారత బలగాల దాడిలో ధ్వంసమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ను పాక్ మళ్లీ నిర్మించింది. దీనికి సంబంధించిన సాటిలైట్ ఇమేజెస్ తాజాగా వెలుగులోకి వచ్చాయి.
