- కాలిఫోర్నియాలో లోయలో పడ్డ కారు.. టూర్‌కు వెళ్తుండగా దుర్ఘటన
- మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాదం
- బాధిత కుటుంబానికి మాజీ ఎంపీ మాలోతు కవిత పరామర్శ
మహబూబాబాద్, వెలుగు: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన పుల్లఖండు మేఘన(24), ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల భావన (24) మూడేండ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.
మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. దీంతో వారిద్దరూ మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
మేఘన తండ్రి నాగేశ్వరరావు.. గార్లలో మీసేవ కేంద్రం నిర్వహిస్తుండగా, భావన తండ్రి కోటేశ్వరరావు గార్ల మండలం ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఉన్నారు. ఉన్నత చదువులకోసం వెళ్లిన వారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పరామర్శించారు. వారి మృతదేహాలను ఇండియాకు తీసుకు రావడం కోసం తమ వంతు సహకారం అందించనున్నట్టు తెలిపారు.
