ఆరావళి పర్వతాలపై ఆర్డర్స్ వెనక్కి.. నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే

ఆరావళి పర్వతాలపై ఆర్డర్స్ వెనక్కి.. నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే
  • హైపవర్​ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి, నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం
  • నవంబర్​ 20న ఇచ్చిన తీర్పుపై స్టే.. విచారణ జనవరి 21కి వాయిదా

న్యూఢిల్లీ: ఆరావళి పర్వత శ్రేణులపై కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ ఇచ్చిన డెఫినేషన్​(నిర్వచనం)కు ఓకే చెప్తూ నవంబర్​ 20న ఇచ్చిన తన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని మరింత లోతుగా స్టడీ చేసేందుకు నిపుణులతో హైపవర్​ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పర్వత శ్రేణులు ఉన్న రాజస్తాన్​, గుజరాత్​, ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఆరావళి పర్వతాలు అంటే.. 100 మీటర్ల కంటే ఎత్తునున్నవి మాత్రమే అని గతంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారుల కమిటీ సిఫార్సులు చేయగా, వాటికి అంగీకరిస్తూ నవంబర్​ 20న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తల నుంచి నిరసన వెల్లువెత్తింది. ఈ నిర్వచనం కారణంగా పర్వత శ్రేణులు ఉన్న రాజస్తాన్​, గుజరాత్​, ఢిల్లీ, హర్యానాలో మైనింగ్​ మాఫియా రెచ్చిపోతుందని.. 100 మీటర్ల లోపు ఉన్న పర్వతాల్లో అక్రమ మైనింగ్​కు ఆజ్యం పోసినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు శనివారం సుమోటోగా కేసును స్వీకరించింది. సోమవారం సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ జేకే మహేశ్వరి, జస్టిస్​ అగస్టిన్​ జార్జ్​ మాసితో కూడిన వెకేషన్​ బెంచ్​ విచారణ జరిపింది. నవంబర్​ 20 నాటి తీర్పును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ చేసిన డెఫినిషన్,  సిఫార్సులపై మరింత స్టడీ చేయాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నామని.. ఇందు కోసం హైపవర్​ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు పర్వత శ్రేణులు ఉన్న నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

అధికారుల కమిటీ ఇచ్చిన డెఫినిషన్​ కారణంగా.. 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో పర్వతాలు ఉన్న ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్​కు అవకాశం ఉందా అనే కోణంలో నిపుణులు​ స్టడీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.

కాగా, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ ​లీజులపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మైనింగ్​ జరుగుతున్న చోట రూల్స్​ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

దాదాపు 670 కిలో మీటర్ల పొడవునా ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, గుజరాత్​ రాష్ట్రాలో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణులు మన దేశంలోనే అత్యంత పురాతనమైనవి. దాదాపు 200 కోట్ల ఏండ్ల చరిత్ర వీటికి ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఆరావళి పర్వత శ్రేణులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.