బెల్లంపల్లిలో పెద్దపులి సంచారం

బెల్లంపల్లిలో  పెద్దపులి సంచారం

బెల్లంపల్లి, మంచిర్యాల, వెలుగు:  బెల్లంపల్లి మండలం పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కన్నాల, లక్ష్మీపూర్, బుగ్గగూడెం, బుగ్గదేవాలయం పరిసరాల్లో సంచరించిన పెద్దపులి కదలికలను అటవీ అధికారులు దాని పాద ముద్రల ద్వారా గుర్తించారు. సోమవారం ఉదయం పెద్దపులి బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి, చర్లపల్లి గ్రామాల సమీపంలో సంచరించినట్లు గుర్తించి, దాని పాద ముద్రలు సేకరించారు.  

చంద్రవెల్లి, చర్లపల్లి గ్రామాల పరిసరాలతోపాటు రాళ్లపేట అటవీ ప్రాంతంలో పులి ఉండొచ్చని బెల్లంపల్లి అటవీ రేంజ్​ ఆఫీసర్​ పూర్ణచందర్​ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నాల, లక్ష్మీపూర్, చంద్రవెల్లి,  చర్లపల్లి గ్రామాల్లో డప్పు చాటింపు చేయించినట్లు పేర్కొన్నారు.  పంటచేనులోకి వెళ్లే వారితోపాటు పశువుల కాపారులు, ఇతర రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

భూపాలపల్లిలో మరో పులి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ పులి సంచారం కలవరపెడుతున్నది.  మహారాష్ట్ర లేదా చత్తీస్‌‌‌‌గఢ్ నుంచి ఓ పులి గోదావరి దాటి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల భూపాలపల్లి అడవి నుంచి జకారం వద్ద రోడ్డు దాటుతుండగా ఓ అంబులెన్స్ డ్రైవర్ చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. ములుగు,అబ్బాపూర్, జాకారం, పందికుంట బీట్లలో పులి పాదముద్రలను గుర్తించారు. కాగా, ములుగు జిల్లాలోకి పులి ప్రవేశించడం ఇది నాలుగోసారి.