- గుజరాత్‌కు చెందిన ఇద్దరు అరెస్ట్
- 22 మ్యూల్ అకౌంట్లలో రూ.3.5 కోట్లు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు, హవాలా ద్వారా డబ్బులు చేరవేస్తున్న గుజరాత్ ముఠా పోలీసులకు చిక్కింది. దుబాయ్‌లోని సైబర్ నేరగాళ్లకు అకౌంట్లు సప్లయ్ చేస్తున్న గుజరాత్ భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయబ్ జాహిత్, బెలిమ్ అనస్ రహీమ్‌ను శనివారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తరలించి రిమాండ్ చేశారు. వీరిద్దరు సప్లయ్ చేసిన 5 మ్యూల్ అకౌంట్లలో రూ.3.5 కోట్లు లావాదేవీలు జరుగగా.. ఇందుకు సంబంధించి 22 కేసులు నమోదైనట్లు గుర్తించారు. వివరాలను సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అర్వింద్ బాబు సోమవారం వెల్లడించారు.
గుజరాత్‌లో అకౌంట్లు.. దుబాయ్‌లో ఆపరేషన్లు
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు నవంబర్‌లో ట్రాయ్ అధికారుల పేరున ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆమె భర్త తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడని.. అరెస్ట్ చేస్తామని బెదిరించారు. నకిలీ ఐడీ కార్డులు, అరెస్ట్ వారెంట్లతో భయాందోళనకు గురిచేశారు. కరెన్సీ సీరియల్ నంబర్ల ధృవీకరణ, కేసు విచారణ, క్లియరెన్స్ ప్రాసెస్ కోసం బెదిరించి రూ.1.95 కోట్లు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు డిసెంబర్ 13న కేసు నమోదు చేశారు.
బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా గుజరాత్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. మ్యూల్ అకౌంట్ల ఆధారంగా గుజరాత్ భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయబ్ జాహిత్, బెలిమ్ అనస్ రహీమ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎస్‌బీఐ బ్యాంకుల్లో మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. డిజిటల్ అరెస్ట్ సహా ఇన్వెస్ట్‌మెంట్ మోసాల్లో సైబర్ నేరగాళ్లు దోచేసిన డబ్బును విత్‌డ్రా చేయడంతో పాటు హవాలా నెట్‌వర్క్ ద్వారా దుబాయ్‌లోని సైబర్ మోసగాళ్లకు బదిలీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇందుకు గాను మ్యూల్ ఖాతాల ద్వారా వచ్చిన డిపాజిట్లపై 15 శాతం కమీషన్ పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదైన 22 సైబర్ నేరాల్లో వీరి మ్యూల్ అకౌంట్లలో రూ.3.5 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఆధారారాలు సేకరించారు. నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో రిమాండ్ చేశారు.
