నిజామాబాద్, వెలుగు: పతంగులు ఎగరవేయడానికి నిషేధిత చైనా మాంజా వాడి ఎవరికైనా ప్రాణహాని జరిగితే, సంబంధిత వ్యక్తులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు చైనా మాంజా సరఫరా అయినట్లు సమాచారం ఉందని, అలాంటి మాంజను స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగించాలని సూచించారు. లేదంటే స్వచ్ఛందంగా కాల్చివేయాలని కోరారు.
నిషేధిత చైనా మాంజాను నిల్వ ఉంచినా, అమ్మినా, అమ్మేందుకు ప్రోత్సహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజాను బయట పడేస్తే ప్రజలకు, జంతువులకు ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా చైనా మాంజా వినియోగం లేదా నిల్వల సమాచారం తెలిసినట్లయితే డయల్ 100కు తెలియజేయాలని ప్రజలను కోరారు.
నెల రోజుల పాటు రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు
జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో జాతీయ రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సంకేతాలు, ఓవర్ స్పీడింగ్, మొబైల్ ఫోన్ వాడకం, సిగ్నల్ జంపింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు.
410 కిలోల ఎండు గంజాయి దహనం..
కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన 410 కిలోల ఎండు గంజాయిని సీపీ సాయిచైతన్య పర్యవేక్షణలో సోమవారం దహనం చేశారు. జక్రాన్‌పల్లి మండలం పడ్కల్ గ్రామంలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉన్న బయో వేస్టేజ్ ప్లాంట్‌లో ఈ గంజాయిని కాల్చివేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో పౌరుల నుంచి 21 ఫిర్యాదులు సీపీ స్వీకరించారు.
