న్యూఇయర్ వేళ డ్రగ్స్, గంజాయి గబ్బు

న్యూఇయర్ వేళ డ్రగ్స్, గంజాయి గబ్బు
  • ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా సరఫరా
  • మియాపూర్​లో ఇద్దరు అరెస్ట్.. 10.5 గ్రాముల ఎండీఏంఏ సీజ్
  •  హైటెక్​సిటీలో చెఫ్ వద్ద 3.4 కేజీల గంజాయి స్వాధీనం​
  • ఉప్పల్, వికారాబాద్, తాండూరులోనూ పలువురు అరెస్ట్

మాదాపూర్, వెలుగు: న్యూఇయర్ వేడుకల వేళ సిటీలో గంజాయి, డ్రగ్స్ గుప్పుమంటోంది. తాజాగా ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన ఇద్దరు యువకులను మాదాపూర్ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్​నగర్​కు చెందిన కేతావత్ రవి (28), జెరుకుల రవి (38) ఇద్దరు మహారాష్ట్రలోని ముంబైకి వలస వెళ్లి అక్కడే పనిచేస్తున్నారు. అధిక సంపాదన కోసం డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నారు. న్యూఇయర్ ను టార్గెట్​చేసుకొని ముంబైలో ఎండీఏంఏ డ్రగ్స్​కొనుగోలు చేసి బస్సులో హైదరాబాద్​కు బయలుదేరారు. పక్కా సమాచారం రావడంతో మియాపూర్​లో దిగిన వీరిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10.5 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

ఒడిశా నుంచి గంజాయి తెచ్చి.. 

హైటెక్ సిటీలో గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఓ చెఫ్​ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన అభిలాశ్ మండల్ (29) మాదాపూర్​లో నివాసం ఉంటూ క్లైరా హోటల్లో చెఫ్​గా పనిచేస్తున్నాడు. న్యూ ఇయర్​కు హైటెక్ సిటీలో గంజాయికి ఉన్న డిమాండ్​ను ఆసరాగా చేసుకొని అభిలాష్ తన సొంతూరులో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చాడు. సోమవారం తన పల్సర్ బైక్​పై మాదాపూర్ సిద్దివినాయక్ నగర్ ప్రాంతంలో గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా, మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 3.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

ఉప్పల్​లో​ ఇద్దరు అరెస్ట్

బీహార్​కు చెందిన రసమల్లా బాలమూర్తి, ఆదర్శకుమార్ ఉప్పల్​లోని హనుమాన్ సాయి నగర్​లో నివాసం ఉంటున్నారు. ఏపీలోని సీలేరు నుంచి ఎండు గంజాయిని తీసుకొచ్చి అవసరమైన వారికి సిటీలో అధిక ధరకు విక్రయిస్తున్నారు.హెచ్‌‌ఎంటీ నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేసి అనుమానంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వికారాబాద్ బోర్డర్ లో ఎండు గంజాయి..

వికారాబాద్: న్యూఇయర్ వేళ వికారాబాద్ డీటీఎఫ్ టీమ్ మర్పల్లి మండల పరిధిలోని జిల్లా బోర్డర్ మొగిలిగుండ్ల చౌరస్తా వద్ద రూట్ వాచ్ చేపట్టారు. ఓ వ్యక్తి  బైక్ పై బ్యాగ్ పెట్టుకొని వస్తుండగా, అతన్ని ఆపి తనిఖీ చేశారు. బ్యాగ్​లో 2.026 కేజీల ఎండు గంజాయి లభించడంతో సదరు వ్యక్తిని అరెస్ట్  చేశారు. నిందితుడిని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని హైదలపూర్ గ్రామానికి చెందిన బుసరెడ్డిపల్లి శివకుమార్ (33)గా గుర్తించారు. విచారణలో మునిపల్లి మండలంలోని తక్కడపల్లి గ్రామానికి చెందిన గొల్ల ఈశ్వరయ్యతో కలిసి గంజాయి సాగు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఈశ్వరయ్యను కూడా త్వరలో అరెస్టు చేస్తామని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీనివాస్ తెలిపారు.

కూరగాయాల ముసుగులో గంజాయి అమ్మకాలు

హైదరాబాద్ మలక్​పేటలో నివాసం ఉంటున్న మహ్మద్ షకీల్ పాషా తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సోమవారం రావడంతో తాండూరు పట్టణ ఎస్ఐ అంబర్యా తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 1,800 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.