వికారాబాద్, వెలుగు : తన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మోసిన్, జితేందర్ రెడ్డి ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. జితేందర్ రెడ్డి, అతడి భార్య పద్మ.. మోసిన్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో మోసిన్ వైరల్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బీసీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి మోసిన్ ఎక్కి తనకు న్యాయం చేయాలని, లేదంటే వాటర్ ట్యాంకు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
విషయం తెలుసుకున్న తాండూర్రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దేముల్ఎస్సై శంకర్, సర్పంచ్ నర్సిములు, ఉప సర్పంచ్ ప్రసాద్, గ్రామ కార్యదర్శి లాలప్ప ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్యాంక్ పై నుంచి దిగాలని మోసిన్ ను కోరారు. తనకు వెంటనే న్యాయం చేస్తేనే దిగుతానని... పైకి ఎవరు వచ్చినా కిందకు దూకుతానని బెదిరించాడు. పోలీసులు వెంటనే జేసీబీ సహాయంతో కబ్జా చేసిన స్థలాన్ని విడిపించారు. దీంతో మోసిన్ ట్యాంక్ పై నుంచి కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో నాలుగు గంటల ఉత్కంఠతకు తెర పడింది.
