హత్య కేసులో దోషికి ఉరి.. 14 ఏండ్ల నాటి కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు

హత్య కేసులో దోషికి ఉరి..  14 ఏండ్ల నాటి కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు
  • లైంగిక దాడిని ప్రతిఘటించినందుకు కత్తితో చంపిన వ్యక్తి 
  • చనిపోయాక శవంపైనా లైంగికదాడి 
  • శిక్ష పడేలా చేసిన సనత్​నగర్​ పోలీసులకు సైబరాబాద్​ సీపీ ప్రశంస 

సనత్​నగర్, వెలుగు :  సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌‌లో 2011లో జరిగిన ఓ మహిళ హత్య కేసులో కూకట్‌‌పల్లి కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. వరుసకు సోదరి అయ్యే యువతిపై నిందితుడు లైంగికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది. దీంతో విచక్షణారహితంగా కత్తితో పలుచోట్ల పొడిచి చంపేసి పరారయ్యాడు. 

ఈ కేసును సీరియస్​గా తీసుకుని దర్యాప్తు చేసిన సనత్​నగర్​పోలీసులు పటిష్టమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు చేసిన నేరం అత్యంత అమానవీయమైనదని భావించిన మూడో అడిషనల్​ డిస్ట్రిక్ట్ ​జడ్జి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.  అలాగే, రూ.10 వేల జరిమానా విధించారు.  

ఏం జరిగిందంటే...

సనత్ నగర్ పోలీస్​స్టేషన్​పరిధిలోని భరత్​నగర్​లో 2011 జూలై 18న ఒంటిపై బట్టలు లేని స్థితిలో ఒంటిపై కత్తిగాట్లతో ఓ యువతి చనిపోయి ఉందని స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కానిస్టేబుల్ కప్పరి రాము ఫిర్యాదుతో అప్పటి ఇన్​స్పెక్టర్​జి.బస్వా రెడ్డి కేసు నమోదు చేయగా, ఇన్​స్పెక్టర్​సాయిని శ్రీనివాస్ రావు దర్యాప్తు చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్​లో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగు చూశాయి. కర్నాటకలోని బీదర్‌‌కు చెందిన కరణ్ సింగ్ అలియాస్ కమ్మ సింగ్ (35)కుటుంబం ఇనుప పనిముట్లు తయారు చేసుకుని బతికేవారు. కరణ్​సింగ్​తండ్రికి ఇద్దరు భార్యలు కాగా, సవతి తల్లి కూతురైన యువతిపై కన్నేశాడు. ఆమెతో కొన్నిసార్లు అసభ్యంగా ప్రవర్తించగా, కరణ్​సింగ్​ను మందలించారు. 

అయినా, తీరు మారకపోవడంతో పోరు పడలేక బాధితురాలు హైదరాబాద్​చేరుకుంది. కొద్ది రోజుల తర్వాత కరణ్​సింగ్​కూడా నగరానికి వచ్చి ఆమె భరత్​నగర్​లో ఉంటుందని తెలుసుకున్నాడు. తాను మారానని చెప్పి భరత్‌‌నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఏసీసీ గోడౌన్ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మద్యం తాగించి లైంగికదాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా  వెంట తెచ్చుకున్న కత్తితో ప్రైవేట్​పార్ట్స్​పై, ఇతర చోట్ల  పొడిచి చంపాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత లైంగికదాడి చేసి పరారయ్యాడు. నగ్నంగా, గుర్తుతెలియని స్థితిలో మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. నెల రోజుల తర్వాత కర్ణాటకలోని బీదర్ జిల్లా లో  ఉంటున్న కరణ్ సింగ్‌‌ను పోలీసులు పట్టుకున్నారు. 

పక్కా సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి మరణశిక్ష విధించింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, కూకట్‌‌పల్లి ఏసీపీ పి.నరేశ్​రెడ్డి , సనత్ నగర్ సీఐ కే. శ్రీనివాసులు, పీపీ రామకృష్ణ రావు, అప్పటి ఐవోలు బస్వారెడ్డి, సాయిని శ్రీనివాస్, సీడీవో శేఖర్​ను ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.