మియాపూర్, వెలుగు: కబ్జాదారుల చెరలో ఉన్న రూ.13 కోట్ల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామ సర్వే నెంబర్ 23లో హుడా అనుమతితో గతంలో ఉషోదయ ఎన్క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది. ఇందులో వెయ్యి గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్‌ఎంసీకి ఈ మేరకు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న నాయకుడు కబ్జా చేసి చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నారు.
తమ కాలనీ పార్కు స్థలం కబ్జాకు గురైందని ఉషోదయ ఎన్క్లేవ్ నివాసితులు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఇటీవల హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పార్కును పరిశీలించారు. పార్కు స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించుకుని సోమవారం ప్రహరీని కూల్చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు.
