క్యాంపస్ లో కంపెనీల ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం : డాక్టర్ షణ్మఖ్ కుమార్

క్యాంపస్ లో కంపెనీల ఏర్పాటు వల్ల  విద్యార్థులకు ఎంతో ప్రయోజనం : డాక్టర్ షణ్మఖ్ కుమార్
  • కేఎల్ యూ ప్రొఫెసర్ డాక్టర్ షణ్మఖ్ కుమార్..

 కొత్తగూడెం : క్యాంపస్​లో  కంపెనీల ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని  కేఎల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖ్ కుమార్ అన్నారు. కొత్తగూడెంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో సోమవారం  విద్యార్థుల అవగాహనా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా    కేఎల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖ్ కుమార్ మాట్లాడుతూ సమకాలిన విద్యా విధానాలపై  విశ్లేషించారు. క్యాంపస్ ఆవరణలోనే పరిశ్రమల ఏర్పాటు వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. 

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాట్లకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఎన్నో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయని తద్వారా యువతకు  మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.   జీవితంలో ఉన్నత విద్య అత్యంత విలువైనదని,  నాలుగు సంవత్సరాల విద్యా ప్రయాణంలో నేర్చుకోవటానికి ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. 

ప్రతి అంశాన్ని నిశితంగాపరిశీలించాలని,  తద్వారా సృజనాత్మక ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు.  లక్ష్య సాధనకు నిర్ధిష్టమైన ప్రణాళిక ఉండాలని,  జీవితాన్ని మార్చుకునే మహోన్నతమైన అవకాశం మీ చేతుల్లోనే ఉందని  స్పష్టం చేశారు. ఆధునిక విద్యా రంగంలో కె. ఎల్ యూనివర్సిటీ ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొంటూ యూనివర్సిటీ ప్రత్యేకతలు, విశిష్టతల గురించి తెలియచేశారు. 

తమ యూనివర్సిటీ పరిశోధనలకు  ప్రాధాన్యం ఇస్తోందని క్యాంపస్ ప్లేసెమెంట్స్ లలో రికార్డులు సృష్టిస్తోందని తమ విద్యార్థి  75 లక్షల అత్యధిక ప్యాకేజీతో ప్లేస్​మెంట్ పొందినట్లు వివరించారు.16 సంవత్సరాలుగా అర్హులైన విద్యార్థులకు 100 శాతం క్యాంపస్ ప్లేసెమెంట్స్ అందిస్తున్నామని, 2025 విద్యా సంవత్సరంలో 8000  మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేసెమెంట్స్ ఆఫర్స్ లభించాయని పేర్కొన్నారు. తమ విద్యార్థులు శాటిలైట్స్ ప్రయోగాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని చెప్పారు.  

విద్యార్థులకు నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా క్యాంపస్ ప్రాంగణంలోనే కంపెనీల ఏర్పాటు చేస్తున్నామని, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా 100 కోట్ల రూపాయల విలువైన స్కాలర్షిప్స్ ద్వారా ఫీజులో రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కృష్ణవేణి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎం.కోటేశ్వరరావు, డీన్ రామారావు, కె ఎల్ యూనివర్సిటీ ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్స్ స్వామి రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జూనియర్ ఇంటర్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమెంటోలు, మెడల్స్ అందచేశారు.