చొప్పదండి, వెలుగు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి సరఫరాతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం చొప్పదండి పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చొప్పదండి మండలానికి చెందిన రామ్‌టైంకి శివప్రసాద్, గోగులకొండ మహేశ్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నారు.
చొప్పదండి, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, రామడుగు గంగాధర పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం చేసి వాటి నుంచి సుమారు 12 కేజీల కాపర్‌ను చొప్పదండిలోని స్క్రాప్ వ్యాపారి అనుమల్ల మల్లేశంకు అమ్మారు. అలాగే కరీంనగర్ 2 టౌన్ పరిధిలోని శర్మ నగర్లో బైక్ చోరీ చేసి అమ్మారు. సోమవారం ఉదయం ఎస్ఐ నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గుమ్లాపూర్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా టూవీలర్‌పై వెళ్తున్న వీరిని పట్టుకున్నారు.
వారిని చెక్ చేయగా వారి వద్ద సుమారు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శివప్రసాద్, మహేశ్ జూలపల్లికి చెందిన నేరుమట్ల అజయ్‌తో కలిసి చంద్రాపూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి చొప్పదండిలో అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి, ఏఎస్ఐ ఫసియుద్దీన్, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
