ఆమనగల్లు, వెలుగు: గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం చేయడం అన్యాయమని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా, ఆయనతోపాటు సంఘ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని రెండేండ్లుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల బకాయి ఉంటే రూ.153 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని చెప్పారు. పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసేంత వరకు పోరాటం ఆపమని తెలిపారు.
రేవల్లి: తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదని మండల మాజీ సర్పంచుల సంఘం నేతలు ఖండించారు. పెండింగ్ బిల్లుల విడుదల కోసం నిరసన తెలపాలని నిర్ణయించుకున్న నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి వనపర్తి, రేవల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. గ్రామ అభివృద్ధి కోసం తమ సొంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
