బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మెగా బడ్జెట్​కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జీహెచ్‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు బడ్జెట్​పై చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)తో పోల్చితే వచ్చే వార్షిక బడ్జెట్​ను రూ.745.27 కోట్లు పెంచి రూ.11,460 కోట్లతో రూపొందించారు. జీహెచ్‌‌ఎంసీలో విలీనమైన 27 లోకల్ బాడీల అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించారు. స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు వచ్చే నెల రెండో వారంలో నిర్వహించనున్న స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. 

కౌన్సిల్​లో చర్చ జరిగి బడ్జెట్​ను ఆమోదించిన తర్వాత తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నారు. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ చార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల నుంచి ఆదాయం సమకూరుతున్నందున ఈసారి రెవెన్యూ ఆదాయాన్ని రూ.6,441 కోట్లుగా పొందుపరిచారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా రూ.4,057 కోట్లుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌‌కు త్వరలోనే కౌన్సిల్ ఆమోదం తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బడ్జెట్​తోపాటు 15 అంశాలు, 7 టేబుల్ ఐటమ్స్​కు సభ్యులు ఆమోదించారు.