రాష్ట్రంలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్

రాష్ట్రంలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్  పెట్టుకున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్​మెంట్​ ద్వారా 8.76 కోట్ల మొక్కలు నాటాలని అటవీ శాఖ నిర్ణయించింది. వీటితోపాటు ఇరిగేషన్, మున్సిపల్ (జీహెచ్​ఎంసీ, హెచ్ ఎం డీ ఏ), అటవీ శాఖలు.. ఏ శాఖ, ఎన్ని మొక్కలు నాటాలో కూడా నిర్ణయించారు. అయితే గత హరితహారం కార్యక్రమాల్లో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, అంగన్ వాడీ , గ్రామ పంచాయతీ ఆఫీస్, ప్రభుత్వ స్కూల్, పీహెచ్ సీ, రోడ్లకు ఇరువైపులా, ప్రతి ఇంటికి ఆరు  మొక్కలు.. ఇలా  అన్నిచోట్ల మొక్కలు నాటారు. ఇప్పుడు మొక్కలు నాటడానికి జాగా లేదని సెక్రటరీలు చెబుతున్నారు.

12 వేల మొక్కలు టార్గెట్ ఇచ్చారు

మా గ్రామంలో 12 వేల మొక్కలు నాటాలని అధికారులు టార్గెట్ ఇచ్చారు. ఇంటింటికి ఆరు మొక్కలు.. గతంలోనే ఇచ్చినం. అవి  బతికుంటే అవసరం లేదంటున్నారు. ఊర్లలో మొక్కలు నాటేందుకు జాగల్లేవు. ప్లేస్ లు గుర్తించి, ఉపాధి స్కీమ్ నుంచి శాంక్షన్ తీసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. మా దగ్గర రైతులకు ఎర్ర చందనం మొక్కలు ఇస్తున్నం. ఏ గ్రామంలో కూడా ఇన్ని మొక్కలు నాటేందుకు జాగా లేదు. 

- మెదక్​కు చెందిన పంచాయతీ సెక్రటరీ

‘ఎక్కడ సర్కారు జాగా ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు నాటాలి. హరితహారం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో రొటీన్ ప్రోగ్రామ్​గా తీసుకోవద్దు. వీలైనంత వరకు పెద్ద మొక్కలు నాటాలి. ఎక్కువ బతికే అవకాశాలు ఉంటాయి.  ప్రాంతం, నేల తత్వాన్ని బట్టి మొక్కలు నాటాలి. ప్రాంతీయ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి.’

- ఫారెస్ట్ స్పెషల్ సీఎస్  శాంతి కుమారి 

‘ఏడేళ్లుగా హరితహారం చేస్తున్నం. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ మొక్కలు నాటినం. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చినం. ఈ  ఏడాది ప్రతి ఊరులో 10 వేల మొక్కలు నాటడానికి గుంతలు తీయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంకా ఎక్కడ నాటాలే. అధికారులేమో మీరేం చేస్తరో తెల్వదు. నాటాల్సిందే అంటున్రు. లేకుంటే నోటీసులు, సస్పెన్షన్లు’ 

-  ఉమ్మడి వరంగల్ జిలాల్లోని ఓ పంచాయతీ సెక్రెటరీ ఆవేదన