ఆవులపల్లి రిజర్వాయర్ పనులు అడ్డుకోవాలని కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ

ఆవులపల్లి రిజర్వాయర్ పనులు అడ్డుకోవాలని కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ
  • కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా, ఎన్​జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆవులపల్లి రిజర్వాయర్ పనులు అడ్డుకోవాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. ఇరిగేషన్​ఈఎన్సీ (జనరల్) మురళీధర్.. ​కేఆర్ఎంబీ చైర్మన్​ శివ్​నందన్ ​కుమార్​కు ​గురువారం లెటర్​ రాశారు. గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి లింకింగ్ ​స్కీమ్​లో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లా సోమాల మండలం ఆవులపల్లిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారని తెలిపారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఫారెస్ట్ క్లియరెన్స్​ సహా ఇతర అనుమతులు కూడా లేవని, ఈ పనులను వెంటనే నిలిపివేయాలని గతంలోనే ఎన్​జీటీ ఆదేశాలు ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు ఈ ప్రాజెక్టుల కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం, పబ్లిక్ ​హియరింగ్ నిర్వహించి తుది అనుమతులు తీసుకోవాలని ఎన్​జీటీ ఆదేశించిందన్నారు.

నిబంధనలు అతిక్రమించి ఈ మూడు రిజర్వాయర్​లు నిర్మిస్తున్నందుకు ఏపీ ప్రభుత్వం కేఆర్​ఎంబీ వద్ద రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని కూడా ఎన్​జీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసిందన్నారు. ఎన్​జీటీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, రూ.100 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలపై కోర్టు స్టే ఇచ్చిందని, అయితే కేఆర్​ఎంబీ వద్ద ఎనిమిది వారాల్లోగా రూ.25 కోట్లు  డిపాజిట్​చేయాలని ఆదేశించిందని తెలిపారు. అయినా, ఏపీ ప్రభుత్వం ఎన్​జీటీ ఆదేశాలను అతిక్రమించి ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణం కొనసాగిస్తున్నదన్నారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ సహా ఇతర అనుమతులు వచ్చే వరకు ఈ రిజర్వాయర్ పనులు నిలిపివేయించాలని కోరారు.