వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ .. 2027 నాటికి పూర్తికానున్న ప్రాజెక్ట్

వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్  .. 2027 నాటికి పూర్తికానున్న ప్రాజెక్ట్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణను ఇండియన్ నేవీ కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో  వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనుంది.  దీని ఏర్పాటుపై చర్చించేందుకు బుధవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డిని నేవీ అధికారులు కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలిశారు.

వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174(2,900 ఎకరాలు) హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం  వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. కాగా, ఈ ప్రాజెక్ట్ దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ సెంటర్  పూర్తికానుంది.