బీజేపీ జాతీయ కమిటీల్లో తెలంగాణకు చోటేది?

బీజేపీ జాతీయ కమిటీల్లో తెలంగాణకు చోటేది?

హైదరాబాద్, వెలుగు: దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. తెలంగాణను గేట్​వేగా చూస్తున్నది. పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న నాలుగు సీట్లను పదికి పెంచుకుంటే.. మిగతా దక్షిణాది రాష్ట్రాలపైనా ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. అయితే, రాష్ట్రానికి చెందిన నేతలకు మాత్రం ముఖ్యమైన జాతీయ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల నియమించిన మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్​ కోఆర్డినేషన్​ కమిటీల్లో తెలంగాణ లీడర్లకు చోటు ఇవ్వకపోగా.. ఇతర రాష్ట్రాలకు ఎలక్షన్​ ఇన్ చార్జుల నియామకంలోనూ ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రాష్ట్ర నేతలకు చోటు ఇవ్వకపోవడంపై కొందరు లీడర్లు నిరాశలో ఉన్నారని తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో 27 మందితో మార్చి 30న మేనిఫెస్టో కమిటీని బీజేపీ నియమించింది. అయితే, అందులో తెలంగాణ నుంచి  ఒక్క నాయకుడికీ జాతీయ నాయకత్వం చోటు ఇవ్వలేదు. దక్షిణాది నుంచి తమిళనాడు, కర్నాటక, కేరళ నేతలకు అవకాశం కల్పించినా.. తెలంగాణను మాత్రం విస్మరించింది. ఆఖరికి లోక్​సభలో ఒక్క సీటు కూడా లేని కేరళ నుంచి కూడా మేనిఫెస్టో కమిటీలో అవకాశం కల్పించింది. కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుని.. ఇప్పుడు పది స్థానాల్లో విజయం సాధించాలనుకుంటున్న కాషాయ దళం.. తెలంగాణ నేతలను కమిటీలో పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. 

ఎలక్షన్​ కో ఆర్డినేషన్​ కమిటీలోనూ అవకాశం ఇయ్యలే

ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల అబ్జర్వేషన్​ కోసం నేషనల్​ ఎలక్షన్​ కో ఆర్డినేషన్​ కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. అందులో పార్లమెంటరీ పార్టీ లీడర్​గా ఉన్న లక్ష్మణ్​కు తప్ప వేరే ఎవరికీ స్థానం ఇవ్వలేదు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సరళిని, ప్రచార కార్యక్రమాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చాలా కీలకం. ఇలాంటి ముఖ్యమైన కమిటీలోనూ తెలంగాణ లీడర్లకు చోటు దక్కలేదు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు ఎన్నికల పర్యవేక్షణ కోసం ఇన్​చార్జులను నియమించిన పార్టీ జాతీయ నాయకత్వం.. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నేతలను ఇన్​చార్జులుగా నియమించింది లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దక్షిణాదిలో కీలకంగా ఉన్న తెలంగాణ నుంచి ముఖ్యమైన కమిటీల్లో లీడర్లను విస్మరించడం ఏందని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.