గ్రూప్‌ 1 ప్రిలిమ్స్​మళ్లీ రద్దు..ఎగ్జామ్​ నిర్వహణలో టీఎస్​పీఎస్సీ నిర్లక్ష్యంపై హైకోర్టు ఫైర్​

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్​మళ్లీ రద్దు..ఎగ్జామ్​ నిర్వహణలో టీఎస్​పీఎస్సీ నిర్లక్ష్యంపై  హైకోర్టు  ఫైర్​
  • పేపర్ల లీకేజీ కారణంగా గతంలోనూ ఒకసారి పరీక్ష క్యాన్సిల్​
  • నోటిఫికేషన్​లోని రూల్స్​ ఎందుకు పాటించలే?
  • బయోమెట్రిక్​ ఎందుకు అమలు చేయలే?
  • ఓఎంఆర్​ షీట్​పై అభ్యర్థి ఫొటో ఎందుకు లేదు?
  • పరీక్ష రాసిన క్యాండిడేట్ల సంఖ్య కూడా 
  • మీకు సరిగ్గా తెలియదా?
  • ఇది కమిషన్​ నిర్లక్ష్యానికి పరాకాష్ట
  • అభ్యర్థులకేనా రూల్స్​ మీరు పాటించరా?
  • తీర్పులో తీవ్రంగా మండిపడిన హైకోర్టు
  • లోపాలు లేకుండా మళ్లీ ఎగ్జామ్​ పెట్టాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ మరోసారి రద్దయింది. జూన్​ 11న జరిగిన ఎగ్జామ్​లో టీఎస్‌పీఎస్సీ అధికారులు నిబంధనలు పాటించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోకపోవడం, అభ్యర్థుల ఫొటో లేకుండానే ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడం ఏమిటని మండిపడింది. గ్రూప్​ 1 పరీక్ష అభ్యర్థులకు ఎంతో కీలకమైనదన్న విషయం తెలిసి కూడా కమిషన్​ ఇంత నిర్లక్ష్యం వహించడం ఏమిటని నిలదీసింది. పరీక్షను రద్దు చేస్తూ శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికైనా పక్కాగా మళ్లీ ప్రిలిమ్స్  నిర్వహించాలని ఆదేశించింది.  503 గ్రూప్​ 1 పోస్టులకు గాను 2022 ఏప్రిల్​ 26న నోటిఫికేషన్​ ఇచ్చి అదే ఏడాది అక్టోబర్​ 16న ప్రిలిమ్స్​ను టీఎస్​పీఎస్సీ నిర్వహించింది. కొన్నిరోజులకు పేపర్ల లీకేజీ వ్యవహారం తెరమీదికి రావడంతో ఆ ప్రిలిమ్స్​ను కమిషన్​ రద్దు చేసి.. ఈ ఏడాది జూన్​ 11న మళ్లీ నిర్వహించింది.  జూన్​ 11న నిర్వహించిన ప్రిలిమ్స్​లో టీఎస్​పీఎస్సీ గైడ్​లైన్స్​ను గాలికి వదిలేసిందని, మళ్లీ నిర్వహించేలా కమిషన్​ను ఆదేశించాలని కోరుతూ గ్రూప్‌–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై వాదప్రతివాదనలు విన్న కోర్టు.. తీర్పును ఆగస్టు 3న రిజర్వు చేసింది. ఇదే క్రమంలో ప్రిలిమ్స్​ను రద్దు చేస్తూ శనివారం జస్టిస్‌ పి.మాధవీదేవి తీర్పు చెప్పారు. 

ఇంత నిర్లక్ష్యమా?

గ్రూప్ 1 ప్రిలిమ్స్​ రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందేనని, ఎందుకు గైడ్​లైన్స్​ పాటించలేదని కమిషన్​ను నిలదీసింది. టీఎస్​పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై  ఆగ్రహం వ్యక్తం చేసింది. 


‘‘జూన్​ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌‌‌‌ తీసుకోలేదు. ఈ చర్య వల్ల అక్రమాలకు చాన్స్​ ఉంటుందన్న పిటిషన్‌‌‌‌ను అనుమతిస్తున్నాం” అని పేర్కొంది. నోటిఫికేషన్‌‌‌‌లోని రూల్స్​ ప్రకారం బయోమెట్రిక్​ను నమోదు చేయాల్సి ఉందని, నిరుడు అక్టోబర్‌‌‌‌ 16న ప్రిలిమ్స్​ అప్పుడు అమలు చేసిన ఈ రూల్​ను  జూన్‌‌‌‌ 11న ఎగ్జామ్​లో  ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ‘‘అక్టోబర్​ 16 నాటి ప్రిలిమ్స్​ పరీక్షను మాత్రమే కమిషన్​ రద్దు చేసింది. కానీ, నోటిఫికేషన్‌‌‌‌ను రద్దు చేయలేదు కదా!! అట్లాంటప్పుడు నోటిఫికేషన్‌‌‌‌లోని నిబంధనను జూన్‌‌‌‌ 11న చేపట్టిన ఎగ్జామ్​ అప్పుడు అమలు చేయకపోవడం ఏమాత్రం కరెక్ట్​ కాదు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నట్లు కమిషన్​ చెప్తున్నా.. నిర్వహణలో లోపాల కారణంగా అది జరిగే అవకాశం ఉందని పిటిషనర్లు చెప్తున్నారు. వారి వాదన సరైందే” అని తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను కూడా టీఎస్​పీఎస్సీ తప్పుగా చూపించిందని హైకోర్టు మండిపడింది. 

జూన్ 28న 2,33,506  మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని వెబ్ నోట్ ఇచ్చిన టీఎస్​పీఎస్సీ.. జులై 12న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్​లో మాత్రం 2,33,248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు చెప్పడం ఏమిటని ప్రశ్నించింది. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తీర్పులో మండిపడింది.  ‘‘టీఎస్‌‌‌‌పీఎస్సీ తీరు సమర్థనీయం కాదు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను కూడా పరస్పర విరుద్ధంగా పేర్కొనడాన్ని బట్టి పరీక్షల నిర్వహణ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థుల సంతకాలు మారినా ఇన్విజిలేటర్లు గమనించకపోవడం తీవ్ర విషయం. ఇలాంటి తప్పుల వల్ల ఒక్క అభ్యర్థి కూడా అర్హత కోల్పోయినా అది అన్యాయమే అవుతుంది. అందుకే ఈ ఏడాది జూన్‌‌‌‌ 11న జరిగిన గ్రూప్‌‌‌‌–1 ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షను రద్దు చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి రాష్ట్ర సర్కార్, టీఎస్‌‌‌‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి” అని  ఆదేశించింది. 

ప్రిలిమ్స్​ నిర్ణయాత్మక పరీక్షే

.
ప్రిలిమ్స్‌‌‌‌ అనేది స్క్రీనింగ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ అయినప్పటికీ అది నిర్ణయాత్మక పరీక్ష అనే విషయం గుర్తుంచుకోవాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ‘‘ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌‌‌‌కు సెలెక్ట్​ అవుతారు. ప్రిలిమ్స్​ నిర్వహణలో లోపాల కారణంగా కొందరు మెరిట్​ అభ్యర్థులు మెయిన్స్‌‌‌‌కు సెలెక్ట్​ కాకపోతే వాళ్ల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించింది. ప్రిలిమ్స్​లో అర్హత సాధించినప్పటికీ మెయిన్స్​ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న టీఎస్​పీఎస్సీ వాదన సరిగ్గా లేదని, ప్రిలిమ్స్‌‌‌‌ అనేది నిర్ణయాత్మకమైనదనే విషయాన్ని పరిగణించాలని స్పష్టం చేసింది. 

ఓఎంఆర్​పై హాల్​టికెట్  నెంబర్​ కూడా లేదు: పిటిషనర్లు

ప్రిలిమ్స్​లో బయోమెట్రిక్‌‌‌‌ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు కమిషన్​ ఆస్కారం ఇచ్చినట్లయిందని హైకోర్టులో వాదనల సందర్భంగా పిటిషనర్ల తరఫు అడ్వకేట్​ గిరిధర్​రావు తెలిపారు. ‘‘హాల్‌‌‌‌ టికెట్‌‌‌‌ నెంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్‌‌‌‌  షీట్లు ఇచ్చేశారు. ఓఎంఆర్‌‌‌‌  షీట్‌‌‌‌ను మ్యానిప్లేట్‌‌‌‌ చేసేందుకు టీఎస్‌‌‌‌పీఎస్సీనే అవకాశం ఇచ్చింది. ఈ విషయాలపై జూన్​ 13న పిషనర్లు ఇచ్చిన వినతిపత్రంపై కమిషన్‌‌‌‌ చర్యలు తీసుకోలేదు. ఒకసారి లీకేజీ జరిగితే గ్రూప్‌‌‌‌ వన్‌‌‌‌ పరీక్షలను కమిషన్‌‌‌‌ రద్దు చేసింది. తిరిగి నిర్వహిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోక పోగా పలు తప్పిదాలకు ఆస్కారం ఇచ్చింది” అని పేర్కొన్నారు. అత్యంత కీలక పోస్టులు భర్తీ చేసే గ్రూప్‌‌‌‌–1 నిర్వహణలోనే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. కాగా, గ్రూప్‌‌‌‌–1 ప్రిలిమ్స్‌‌‌‌ నిర్వహణకు టీఎస్‌‌‌‌పీఎస్సీ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుందని, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని వాదనల సందర్భంగా అడ్వకేట్​ జనరల్ బీఎస్​ ప్రసాద్​ పేర్కొన్నారు. ‘‘ఆధార్, పాన్, ఎన్నికల కార్డు లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులతోనే అభ్యర్థుల హాల్‌‌‌‌టికెట్లను పరిశీలించాం. ఆ గుర్తింపు కార్డుతో హాల్‌‌‌‌ టికెట్లను సరిపోల్చి చూశాం. ఆ తర్వాతే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ఒక క్యాండిడేట్​కు సంబంధించిన సంతకంపై పిటిషనర్‌‌‌‌ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పరీక్షలను రద్దు చేస్తే లక్షల మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతారు” అని తెలిపారు. ప్రిలిమ్స్‌‌‌‌ ఫలితాల వెల్లడికి అనుమతించాలని కోరారు.

అభ్యర్థులే కాదు కమిషన్​ కూడా రూల్స్​ పాటించాల్సిందే

నోటిఫికేషన్‌‌‌‌లో టీఎస్​పీఎస్సీ జారీ చేసిన రూల్స్, అడ్వయిజ్‌‌‌‌లను అభ్యర్థులే కాకుండా కమిషన్‌‌‌‌ కూడా తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘నోటిఫికేషన్‌‌‌‌లో నిబంధనలను మార్పు చేసే అధికారం కమిషన్‌‌‌‌కు ఉంది. అయితే, ఆ మేరకు అనుబంధ నోటిఫికేషన్‌‌‌‌ను జారీ చేయాలి. గ్రూప్‌‌‌‌ 4 పరీక్షలప్పుడు చేసినట్లుగానే గ్రూప్​ 1కు చేయాల్సింది. కానీ చేయలేదు” అని గుర్తుచేసింది. మొత్తంగా నోటిఫికేషన్​లోని నిబంధనలు కమిషన్​ అమలు చేయలేదని, ఇది ఏమాత్రం సహించరానిదని పేర్కొంటూ ప్రిలిమ్స్​ను హైకోర్టు రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. 

గ్రూప్‌‌‌‌–1 పేపర్​ లీకేజీపై పిల్​ పెండింగ్​

గ్రూప్‌‌‌‌–1 ప్రిలిమ్స్‌‌‌‌ పేపర్‌‌‌‌ లీకేజీ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిల్‌‌‌‌ హైకోర్టు విచారణలో ఉంది. ఈ పిల్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరధే ఆధ్వర్యంలోని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఇటీవల విచారణ చేపట్టింది. గత నెలలో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.