చలాన్ల వసూలు కోసం బెదిరింపులొద్దు: హైకోర్టు

చలాన్ల వసూలు కోసం బెదిరింపులొద్దు: హైకోర్టు
  •     ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ప్రాసిక్యూట్ చేయండి 
  •     చలాన్లు కట్టకుంటే నోటీసులివ్వండి 
  •     వారు కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి, చలాన్లు కట్టని వాహనదారులను కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలని ట్రాఫిక్‌‌ పోలీసులకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, చలాన్ల వసూళ్ల కోసం వాహనదారులను బెదిరింపులకు గురిచేయరాదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం కోర్టు ద్వారా సమన్లు జారీ చేసి వసూళ్లు చేయాలని ఆదేశించింది. చలాన్లను ఆన్‌‌లైన్‌‌ల ద్వారా చెల్లించేవారికి ఆ అవకాశం ఇవ్వాలని, చెల్లించనివారిపై ప్రాసిక్యూషన్‌‌ చర్యలు చేపట్టాలని చెప్పింది. ఎలాంటి నిబంధనలు చూపకుండా దిచక్ర వాహనంపై ముగ్గురితో ప్రయాణిస్తున్నందున చలానా వేయడాన్ని, జరిమానా వసూలు చేసే అధికారాన్ని కల్పిస్తూ 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో108ని సవాలు చేస్తూ వి.రాఘవేంద్రాచారి అనే వ్యక్తి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌కుమార్‌‌ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు వాహనాలను నిలిపి బెదిరించి మరీ చలాన్లను వసూలు చేస్తున్నారని తెలిపారు. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్‌‌ 200 కింద జరిమానాలు విధించి వసూలు చేయడానికి పోలీసులు, రవాణాశాఖ అధికారులకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, దాన్ని నోటిఫై చేయలేదన్నారు. పభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జీవో 108ని నోటిఫై చేయలేదని అంగీకరించారు. సమగ్ర కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. 

చలాన్లు కట్టనివాళ్లు కోర్టుకు రావాల్సిందే.. 

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పెండింగ్‌‌ చలాన్ల వసూళ్లలో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేయరాదని పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్‌‌ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్‌‌కు చర్యలు చేపట్టే అధికారం  పోలీసులకు ఉందని స్పష్టతనిచ్చారు. స్వచ్ఛందంగా ఇచ్చే చెల్లింపులను స్వీకరించవచ్చని, చెల్లింపులకు నిరాకరించినవారు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ట్రాఫిక్‌‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, సాధారణ విధుల్లో భాగంగా వాహనదారుల తనిఖీని నిర్వహించడానికి ఈ ఉత్తర్వులు ఎలాంటి ఆటంకం కలిగించవని జడ్జి పేర్కొన్నారు. అలాగే జీవో108 అమలును నిలిపివేయాలన్న పిటిషనర్‌‌ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.