- గ్లోబల్ హెల్త్ కాన్‌క్లేవ్‌లో వైద్య రంగ నిపుణుల సూచనలు
- హెల్త్ విజన్-2047 ప్రకటించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: వైద్యమనేది వ్యాపారం కాదని.. అది ప్రతి పౌరుడికి అందాల్సిన ప్రాథమిక హక్కని వైద్య రంగ నిపుణులు అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో భాగంగా సోమవారం నిర్వహించిన హెల్త్ కాన్‌క్లేవ్‌లో వైద్య రంగ దిగ్గజాలు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు. హైదరాబాద్ ప్రపంచస్థాయి మెడికల్ హబ్‌గా ఎదిగినప్పటికీ, అత్యాధునిక వైద్య సేవలు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు చేరలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యవంతమైన సమాజమే పునాదని, దీనికి ప్రభుత్వ-ప్రైవేటు రంగాల సమన్వయం (పీపీపీమోడల్) అనివార్యమని పిలుపునిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఆరోగ్యశ్రీ అమలు తీరును పునఃసమీక్షించి మెరుగుపరచాలని సూచించారు.
దేశానికే ఆరోగ్యశ్రీ దిక్సూచి: డా.సంగీత రెడ్డి
హెల్త్ కాన్‌క్లేవ్‌లో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం దేశ వైద్య రంగానికే గేమ్ చేంజర్‌గా మారిందన్నారు. ఎంపీ, మెడిహీల్ గ్రూప్ అధినేత స్వరూప్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే లభ్యత, సులభ చేరువ, ఆర్థిక వెసులుబాటు, ఆమోదయోగ్యత అనే నాలుగు కీలక స్తంభాలు అవసరమన్నారు. ప్రస్తుతం వైద్య ఖర్చులో దాదాపు 45 శాతం మందులకే వెచ్చిస్తున్నారని, ఇది సామాన్యుడిపై భారీ భారం మోపుతోందన్నారు.
కేవలం నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకే అత్యాధునిక వైద్యం పరిమితం కాకూడదని నిపుణులు జెలాలెమ్ టఫెస్సే అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్ డాక్టర్ అనిత అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతి మెడికల్ కాలేజీ కనీసం 50 గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్రతిపాదన చేశారు.ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ.. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ..దేశంలో పోషకాహార సూచీలు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పారిశుధ్య లోపం, ఆహార వైవిధ్యం లేకపోవడమే కారణమని చెప్పారు.
హెల్త్ విజన్ 2047కు బడ్జెట్‌లో 8% నిధులు
ఈ సందర్భంగా వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ‘‘హెల్త్ విజన్-2047’’ను ప్రకటించారు. ప్రతి పౌరుడికీ నాణ్యమైన, అందుబాటు వైద్యమే లక్ష్యంగా ‘‘హెల్త్ విజన్-2047’’ను రూపొందించినట్లు చెప్పారు. 2047 నాటికి రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య కేటాయింపులను ప్రస్తుత 4% (రూ.12,801 కోట్లు) నుంచి 8%కు పెంచుతామని ప్రకటించారు. మూడంచెల వైద్య విధానం ద్వారా 5,023 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 184 టీవీవీపీ ఆసుపత్రులు, 35 టీచింగ్ ఆసుపత్రులు, 13 స్పెషాలిటీ ఇన్‌స్టిట్యూట్లు, ఉస్మానియా, -గాంధీ ఆధునీకరణ, రూ.1,698 కోట్లతో నిమ్స్ విస్తరణ (2,020 పడకలు), వరంగల్ హెల్త్ సిటీ (1,750 పడకలు), సనత్‌నగర్-అల్వాల్-ఎల్బీనగర్ టిమ్స్ వంటి సమగ్ర చర్యలను వివరించారు.

