సోమేశ్ కుమార్‌‌‌‌ కేసు తీర్పే.. అంజనీ కుమార్‌‌‌‌ కేసుకూ వర్తిస్తుంది

సోమేశ్  కుమార్‌‌‌‌ కేసు తీర్పే..  అంజనీ కుమార్‌‌‌‌  కేసుకూ వర్తిస్తుంది

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్‌‌‌‌తో పాటు మరో ఐదు పిటిషన్లలో మాజీ సీఎస్‌‌‌‌  సోమేశ్  కుమార్‌‌‌‌  కేసులో ఇచ్చిన తీర్పు వర్తించేలా తుది తీర్పు చెప్పాలని రాష్ట్ర హైకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వ అధికారుల విభజన విషయంలో సోమేశ్  కుమార్‌‌‌‌ కేసులో ఆయన ఏపీ క్యాడర్‌‌‌‌కు చెందుతారని హైకోర్టు ఇచ్చిన తీర్పునే డీజీపీ పిటిషన్​కూ వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. డీజీపీతో పాటు 12 మంది ఆలిండియా సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించిన వివాదాన్ని జస్టిస్‌‌‌‌  అభినందకుమార్‌‌‌‌  విలి, జస్టిస్‌‌‌‌ పుల్లా కార్తీక్ తో కూడిన డివిజన్‌‌‌‌  బెంచ్‌‌‌‌  సోమవారం విచారించింది.

ప్రత్యూష్‌‌‌‌  కుమార్‌‌‌‌  సిన్హా కమిటీ సిఫార్సులు సోమేశ్ కుమార్‌‌‌‌ విషయంలో చెల్లుబాటు అవుతాయని, ఆయనను ఏపీకి కేటాయించడం సబబేనని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌‌‌‌  జనరల్‌‌‌‌ గాడి ప్రవీణ్‌‌‌‌  కుమార్‌‌‌‌ వాదించారు. అంజనీ కుమార్, రొనాల్డ్‌‌‌‌  రాస్, అనంతరాము, ఎస్‌‌‌‌.ఎస్‌‌‌‌.రావత్, ఆమ్రపాలి, అభిలాష్  బిస్త్రీల కేటాయింపు వ్యవహారంలో సోమేశ్​కుమార్‌‌‌‌ కేసు తీర్పు వర్తిస్తుందన్నారు. అయితే, ఆ తీర్పు తమకు వర్తించదని అధికారుల తరఫు అడ్వొకేట్  చెప్పారు. డివిజన్‌‌‌‌  బెంచ్‌‌‌‌ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌‌‌‌  దాఖలు చేసిందని, దీనిపై తుది తీర్పు వచ్చే వరకు ఇతర అధికారుల కేసుల విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో రెండు వారాల తర్వాత సమగ్ర విచారణ చేపడతామని డివిజన్​ బెంచ్​ తెలిపింది.