
రాష్ట్ర హైకోర్ట్.. చీఫ్ జస్టిస్ గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ చౌహాన్ తో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆయన తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్నారు చౌహాన్. ఇవాళ పూర్తి స్థాయి బాధ్యతలను చేపట్టారు. సీజే ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 1959 డిసెంబర్ 24 న జన్మించారు. అమెరికాలోని ఆర్కేడియా యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. 1980 లో డీయూ నుంచి ‘లా’ పట్టా పొందారు. 1986 నుంచి 2005 వరకు రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2005 జూన్ 13 న రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు రాఘవేంద్ర సింగ్ చౌహాన్. 2015 మార్చి 10 న కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఆయన బదిలీ అయ్యారు. జస్టిస్ చౌహాన్ గతేడాది నవంబరు 21న హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జిగా కొనసాగారు. తెలంగాణ హైకోర్టు సీజే టీబీ రాధాకృష్ణన్ కోల్ కతా హైకోర్టు సీజేగా బదిలీ అయిన తర్వాత.. ఏప్రిల్ 4న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.