రాష్ట్ర ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోలేం...కమ్యూటేషన్ పెన్షన్ పాలసీలో ప్రభుత్వ నిర్ణయం కరెక్టే : హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోలేం...కమ్యూటేషన్ పెన్షన్  పాలసీలో ప్రభుత్వ నిర్ణయం కరెక్టే : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్‌‌  ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్‌‌  విధానంలో ఒకేసారి ముందే తీసుకున్న సొమ్మును 15 ఏళ్ల పాటు రికవరీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేతన కమిషన్‌‌  సిఫార్సు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని రాష్ట్రం నిర్ణయించిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తోందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనని తీర్పు చెప్పింది. 

కమ్యూటెడ్‌‌  పెన్షన్‌‌  రూపంలో ఒకేసారి తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని 11 ఏళ్ల 3 నెలలు వసూలు చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే పెన్షన్‌‌  సొమ్ములో కమ్యూటేషన్‌‌  పెన్షన్‌‌  కింద ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని 15 ఏళ్ల పాటు రాష్ట్రం రికవరీ చేస్తుంది. ఇలా రికవరీ చేశాకే పూర్తిస్థాయి పెన్షన్‌‌  పునరుద్ధరణకు వీలు ఉంటుంది. 

తెలంగాణ సివిల్‌‌  పెన్షన్స్‌‌ (కమ్యూటేషన్‌‌) రూల్‌‌ 18ను సవాలు చేస్తూ హైదరాబాద్‌‌లోని చందానగర్‌‌కు చెందిన అటవీ శాఖ మాజీ డిప్యూటీ కన్జర్వేటర్‌‌ ఆచార్యులుతోపాటు పలువురు పిటిషన్లు వేశారు. వీటిపై హైకోర్టు జడ్జీలు జస్టిస్‌‌  శామ్‌‌ కోషి, జస్టిస్‌‌  నర్సింగ్‌‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న హైకోర్టు..  అన్నీ తెలిసి లబ్ధి పొందే పిటిషనర్లు రూల్‌‌ 18ని సవాల్‌‌ చేయడం చెల్లదని తేల్చి చెప్పింది.