
- చర్యలు చట్ట ప్రకారమే ఉండాలని స్పష్టం
- ఆదేశాలు ఉల్లంఘిస్తే హైడ్రానే రద్దు చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కూల్చివేతలకు తొందర ఎందుకని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. రాత్రికి రాత్రి హైదరాబాద్ సిటీని మార్చేయలేరని హితవు చెప్పింది. ఏ చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారం ఉండాల్సిందేనని, ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. హడావుడిగా కూల్చివేతలు చేపట్టడం ఏమిటని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని తప్పపట్టింది. సరైన విచారణ నిర్వహించకుండా, వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడటం సరికాదని చెప్పింది.
‘‘ఓసారి ఉదయం 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు. అలా చేయాల్సింది అధికారులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్రమణకు గురైన స్థలాల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు కోర్టులు వ్యతిరేకం కాదు. అయితే, ఏ చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారం ఉండాల్సిందే’’నని కోర్టు తేల్చిచెప్పింది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి సర్వే నంబర్ 296/ఇ/2లోని మూడు గుంటల భూమిలో షెడ్‌ను ఎలాంటి సమాచారం లేకుండా ఆదివారం కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హైడ్రా ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టగా.. రాజశేఖర్ కూడా విచారణకు హాజరయ్యారు.
హైడ్రానే రద్దు చేస్తామని హెచ్చరిక
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘‘పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతిపత్రంపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. భూమార్పిడి పత్రాలు, సేల్ డీడ్, పంచాయతీ అనుమతి డాక్యుమెంట్లను ప్రవీణ్ సమర్పించారు. అయినా పట్టించుకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారు. ఫిర్యాదు లోపభూయిష్టంగా ఉంది. అందులో సర్వే నంబర్ పేర్కొనలేదు. పంచాయతీ కార్యదర్శికి బదులుగా సర్పంచ్ సంతకం చేశారు.
లేఅవుట్‌లోని లోటుపాట్లను కప్పిపుచ్చుకునేందుకు ప్రవీణ్ భూమిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు” అని తెలిపారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్‌రెడ్డి వాదిస్తూ.. ‘‘పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారు. తర్వాత వాటిని రద్దు చేశారు. సెలవు రోజు కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని విన్నవించారు. వాదనల తర్వాత జడ్జి స్పందిస్తూ.. ‘‘మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అంటూనే మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేస్తాం”అని చెప్పారు.