సింగరేణికి షాక్.. మెడికల్ బోర్డు రిపోర్టులు చెల్లవు : హైకోర్టు

సింగరేణికి షాక్.. మెడికల్ బోర్డు రిపోర్టులు చెల్లవు : హైకోర్టు
  •     హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల అంగవైకల్యాన్ని నిర్ధారించడంలో మెడికల్ బోర్డు వ్యవహరించిన తీరును తెలంగాణ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సుమారు 121 మంది కార్మికులకు సంబంధించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ ఒకే రకమైన ‘సాధారణ అంగవైకల్యం’గా నిర్ధారించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా అంగవైకల్యం బారినపడిన తమకు బదులుగా, కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని కార్మికులు కోరారు. 

అయితే, మెడికల్ బోర్డు వీరి అభ్యర్థనలను తిరస్కరించడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సింగరేణి యాజమాన్యం అప్పీలు చేయగా, తాజాగా చీఫ్ జస్టిస్ అపరేశ్‌‌‌‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తుది తీర్పు వెలువరించింది.అందరినీ ఒకే కోవలోకి చేర్చి ‘సాధారణ అంగవైకల్యం’ అని పేర్కొనడం బోర్డు బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నదని తెలిపింది.