
హైదరాబాద్, వెలుగు: పొగాకుతో తయారు చేసే ఖైనీ, గుట్కా, సుగంధ పరిమళ పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులు చట్ట ప్రకారమే ఉన్నాయని హైకోర్టు తీర్పు చెప్పింది. గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన 125కుపైగా రిట్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ మంగళవారం డిస్మిస్ చేసింది. ఈ ఏడాది జనవరి 6న పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన రిట్లను డిస్మిస్ చేసింది. ‘‘రాష్ట్ర ఆహార భద్రత చట్టం–2006 కింద పొగాకుతో తయారయ్యే ఉత్పత్తులను బ్యాన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని హరించే వాటిని నిషేధించాలని 2003లోనే సుప్రీంకోర్టు చెప్పింది. పౌడర్, టూత్‌పేస్ట్‌లో పొగాకు వినియోగాన్ని కూడా నిషేధించింది. పొగాకు వల్ల కరోనా కంటే తీవ్రమైన సమస్యలు వస్తాయి” అని తీర్పు చెప్పింది.