తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
  • క‌రోనా ప‌రీక్ష‌లపై ఇచ్చిన‌ ఆదేశాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం

కరోనా టెస్టుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ తెలంగాణ‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన స‌మ‌యంలో మృతదేహాలకు కూడా పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. రాష్ట్రంలో టెస్టుల పెంపు, మృత‌దేహాల‌కు ప‌రీక్ష‌లపై త‌మ‌ ఆర్డ‌ర్ ను అమ‌లు చేయ‌పోతే ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామ‌ని న్యాయ‌స్థానం హెచ్చ‌రించింది. వైద్య‌, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని స్ప‌ష్టం చేసింది. ఈ సందర్భంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫు అడ్వొకేట్‌ జనరల్ వాద‌న‌ల‌ను వినిపిస్తూ.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశామని, విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. అయితే సుప్రీం కోర్టు విచారణ జరిగే వరకు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందేని ధర్మాసనం స్పష్టం చేసింది. వైర‌స్ విప‌రీతంగా ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలోనూ ప్రజల్లో కరోనా ర్యాండమ్‌ టెస్టులు చేయడంలేదని ప్రభుత్వంపై ఆసహనం వ్యక్తం చేసింది. పీపీఈ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా వైరస్‌ సోకిందని అభిప్రాయ‌ప‌డింది. మీడియా బులిటెన్ల‌లో తప్పడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు. కేసులు, మ‌ర‌ణాల‌పై వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. ఈ నెల 18లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.